ఈవీఎంలను ట్యాంపర్‌ చేస్తాం.. డబ్బులివ్వండి!

Posted on : 06/12/2018 05:58:00 pm


దేశంలో ఎన్నికల ప్రక్రియలో ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యాంత్రాలు (ఈవీఎం) ట్యాంపరింగ్‌కు గురయ్యే అవకాశం ఉందంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ... తాజాగా మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఓ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అభ్యర్థికి దిల్లీకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఫోన్‌ చేసి.. 'ఈవీఎంలను ట్యాంపర్‌ చేస్తాం. మీకు అనుకూలంగా ఫలితాలు వచ్చేలా చేస్తాం. ఇందుకు గానూ, ఒక్కో ఈవీఎంకి 2.5 లక్షల చొప్పున తీసుకుంటాం' అని చెప్పాడు. అయితే, ఈ విషయంపై ఆ కాంగ్రెస్‌ అభ్యర్థి పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకి సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు.

భింద్‌ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి రమేశ్‌ దుబేతో దిల్లీ నుంచి ఓ వ్యక్తి ఫోనులో మాట్లాడాడని పోలీసులు చెప్పారు. తమ ఇంజినీర్ల బృందం ఈవీఎంలను హ్యాక్‌ చేస్తుందని అన్నాడని తెలిపారు. దీంత రమేశ్‌ ఆయనను మధ్యప్రదేశ్‌కు రమ్మన్నారు. అనంతరం ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిల్లీ నుంచి అభయ్‌ జోషి (30) అనే వ్యక్తి గ్వాలియర్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకోగా, రమేశ్‌ కూడా అక్కడికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. కొన్ని సర్క్యూట్‌ల ద్వారా తాము ఈవీఎంలను ప్రభావితం చేస్తామని ఆయనకు అభయ్‌ వివరించాడు. తన సెల్‌ఫోన్‌లో ఇందుకు సంబంధించిన ఓ దృశ్యాన్ని చూపించాడు. తాము ఒక్కో ఈవీఎంకు 2.5 లక్షలు తీసుకుంటామని తెలిపాడు. అయితే, అప్పటికే నిందితుడి కోసం రైల్వే స్టేషన్‌ చేరుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

ఈ కేసుపై గ్వాలియర్‌ ఎస్పీ నవనీత్‌ భాసిన్‌ మాట్లాడుతూ... 'ఈ ఘటనలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు మేము జోషిని ప్రశ్నిస్తున్నాము. మా పోలీసు బృందాన్ని దిల్లీకి పంపి, ఆయన ఇంట్లోనూ సోదాలు చేయమని చెబుతాము. ఈవీఎంలు ట్యాంపరింగ్‌ చేస్తామంటూ నమ్మించి అభ్యర్థుల వద్ద డబ్బు తీసుకునేందుకే ఆయన ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నాము' అని తెలిపారు. కాగా, స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రత పర్చిన ఈవీఎంలలో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుండగా, మరోవైపు ఇటువంటి ఘటన వెలుగులోకొచ్చింది.