కళా వెంకట్రావుపై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు

Posted on : 06/12/2018 06:08:00 pm


ఏపీ మంత్రి కళా వెంకట్రావుపై వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో ఉన్న జగన్ చిలకపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు, మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కళా వెంకట్రావు ప్రజలకు అందుబాటులో ఉండరు కానీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో మాత్రం ముందుంటారని ఆయన సంచలన ఆరోపణ చేశారు. కోట్లు విలువచేసే భూమిని తన కొడుకుకు కారు చవకగా ఇచ్చారని విమర్శలు గుప్పించారు.

తోటపల్లి ప్రాజెక్ట్‌ దివంగత నేత వైఎస్‌ హయాంలోనే 90శాతం పూర్తయిందని.. 10శాతం పనులు చేయించలేని దుస్థితిలో టీడీపీ ప్రభుత్వం ఉందని జగన్ ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి రాగానే పరిశ్రమల్లో స్థానికులకే 75శాతం ఉద్యోగాలిచ్చేలా చట్టం తెస్తామని వైసీపీ అధినేత స్పష్టం చేశారు. తితలీ తుపానును ప్రభుత్వం ప్రచారానికి వాడుకుందన్నారు. తుపానుతో రూ.3,435కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు కానీ.. బాధితులకు రూ.520కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని జగన్ ఆరోపణలు చేశారు.