13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4వరకే పోలింగ్: రజత్‌కుమార్

Posted on : 06/12/2018 07:08:00 pm


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 13 సమస్యాత్మక నియోజకవర్గాలను గుర్తించామని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ చెప్పారు. గురువారం సాయంత్రం పోలింగ్ ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకే ఓటు వేయడానికి అనుమతి ఉంటుందన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో 5గంటల వరకూ పోలింగ్ యథావిథిగా జరుగుతుందన్నారు. సాయంత్రం 5గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటే ఓటేసే అవకాశం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఓటింగ్ రోజు కూడా సీ విజిల్ యాప్‌ను వాడుకోవచ్చని అన్నారు. ఈవీఎంలలో సమస్యలు వస్తే 30 నిమిషాల్లో కొత్తవి ఏర్పాటు చేస్తామని రజత్‌కుమార్ తెలిపారు.

రజత్ కుమార్ మాటల్లోనే... " ఇప్పటి వరకూ 100శాతం ఓటర్ స్లిప్పుల పంపిణీ జరిగింది. ప్రధాన ఎన్నికల అధికారుల ఆదేశాలకు అనుగుణంగా భద్రత నిర్వహించాము. ఇప్పటి వరకు పోలీస్ శాఖ 125 కోట్లు డబ్బు సీజ్ చేసింది. 4 లక్షల లీటర్ల లిక్కర్ సీజ్ చేశాము. ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేశాము. మధ్యప్రదేశ్, బీహార్, ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి 20 వేల మంది బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశాము. తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం లేదు. అయినా కూడా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉన్నాం. మహారాష్ట్ర, చత్తీస్‌ఘఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశాం. 4 వేలకు పైగా మస్యాత్మక ప్రాంతాలను గుర్తించాము. మావోయిస్టు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. కొడంగల్ రేవంత్ రెడ్డి అరెస్ట్ కోర్ట్ పరిధిలో ఉంది. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఆ విషయంపై మాట్లాడలేను. ప్రతి ఏరియాలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశాం.కూంబింగ్ ఆపరేషన్ కోసం స్పెషల్ టీం లను ఏర్పాటు చేశాం. ప్రజలందరూ ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి" అని ఎన్నికల అధికారి పిలుపునిచ్చారు.