వివ‌రాలు వెల్ల‌డించం : ఫేస్ బుక్

Posted on : 10/01/2018 04:25:00 pm

ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ సంస్థకు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ మొదలైంది. సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఫేస్ బుక్ లో గతంలో పోస్ట్ లు చేశారు.. అవి ఏ ఐపీ అడ్రసుల నుంచి వచ్చాయోతెలుసుకునేందుకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు విశ్వప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ విషయమై సాయం పడాల్సిందిగా కోరుతూ ‘ఫేస్ బుక్’ నిర్వాహకులను సీసీఎస్ పోలీసులు కలిశారు. అయితే, ఆ ఐపీ అడ్రసు వివరాలు చెప్పమని ఫేస్ బుక్ తేల్చి చెప్పింది. సాధారణ కేసులు లాంటిది కాదని, సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు అని పోలీసులు ఎంతగా చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదు. ఈ సంఘటనపై మండిపడుతున్న పోలీసులు ఈ విషయమై కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. సీఐడీ ద్వారా ఎంహెచ్ ఏకు ఓ లేఖ రాశారు. కాగా, కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై చాదర్ ఘాట్ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసు సీసీఎస్ పోలీసులకు సంబంధించింది కావడంతో వీరికి బదిలీ అయింది. అప్పటి నుంచి కూడా ఈ కేసుపై విచారణ జరగుతోంది.ఫేస్ బుక్ నిర్వాహకులు సంబంధిత వ్యక్తుల ఐపీ అడ్రసులు ఇవ్వకపోవడంతో ఆ పోస్ట్ లు ఎవరు చేశారా అనే విషయం ఇప్పటివరకూ తేలలేదు. దీంతో, ఈ కేసు దర్యాప్తు జాప్యం అవుతోంది.