కోడి పందేలపై సందిగ్ద‌త..!

Posted on : 13/01/2018 11:02:00 pm

కోస్తాలో కోడి పందేల నిర్వ‌హ‌ణ‌ఫై సందిగ్ద‌త నెల‌కొంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేర‌కు కోడి పందేలు నిర్వ‌హించుకోవ‌చ్చంటూ నిర్వ‌హ‌కులు చెబుతుండ‌గా, హై కోర్టు తీర్పు మేర‌కు న‌డుచుకుంటామ‌ని పోలీసు, రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. కోడి పందేల ముసుగులో జ‌రిగే చ‌ట్ట వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు అడ్డు క‌ట్ట వేయాలంటూ రాష్ట్ర డీజీపీ డాక్ట‌ర్ ఎం. మాల‌కొండ‌య్య, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దినేష్ కుమార్ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఉన్న‌తాధికారుల ఆదేశాల మేర‌కు జిల్లాల ఎస్పీలు పోలీసు, రెవెన్యూ అధికారుల‌తో క‌లిసి త‌నిఖీ బృందాలు ఏర్పాటు చేశారు. కోడి పందేల బ‌రుల స‌మీపంలో మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిపితే దాడులు నిర్వ‌హించి కేసులు న‌మోదు చేస్తామంటూ ఎక్సైజు ఉన్న‌తాధికారులు హెచ్చరిస్తున్నారు. విచార‌ణ‌లో మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు తేలితే సంబంధిత షాపుల లైసెన్సులు ర‌ద్దు చేసేందుకు కూడా వెనుకాడేది లేదంటూ వీరంటున్నారు. ఉభ‌య గోదావ‌రి, కృష్ణా, గుంటూరు  జిల్లాల్లోని 110 వ‌ర‌కు కోడి పందేల నిర్వ‌హ‌ణ‌కు పెద్ద బరులు ఏర్పాటు చేసిన‌ట్లు పోలీసు అధికారులు చెపుతున్నారు. ఆయా బ‌రుల వ‌ద్ద సెక్ష‌న్ 144 విధిస్తూ పోలీసు అధికారులు ఉత్త‌ర్వులు జారీ చేశారు. దీనిపై ప్ర‌జాప్ర‌తినిధులు, నిర్వ‌హ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కోళ్ల‌ను స్వాధీనం చేసుకోవ‌డంతో పాటు రైతుల‌ను అదుపులోకి తీసుకోవ‌ద్ద‌టూ బీజీపే నేత రాఘురామ్ కృష్ణంరాజు దాఖ‌లు చేసిన పిటీష‌న్ పై సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాల‌కు విరుద్ధంగా పోలీసు అధికారులు వ్య‌హ‌రిస్తున్నారంటూ చెబుతున్నారు. కోళ్ల‌ను అదుపులోకి తీసుకోవ‌డం, రైతుల‌ను అరెస్టు చేయ‌వ‌ద్ద‌ని చెప్ప‌డమంటే కోడి పందేలు నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని కాద‌ని అధికారులు అంటున్నారు. ఇళ్ల‌ల్లో ఉంచిన కోళ్ల‌కు మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంది త‌ప్ప బ‌రుల వ‌ద్ద‌కు తెస్తే క‌త్తులు క‌ట్టినా, క‌ట్ట‌క‌పోయినా స్వాధీనం చేసుకుని అరెస్టు చేస్తామంటూ హెచ్చ‌రిస్తున్నారు. కోళ్ల‌కు క‌త్తులు క‌ట్టేవారిపై పోలీసులు బైండోవ‌ర్ కేసులు న‌మోదు చేస్తున్నారు. అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. ఒక్క ప‌శ్చిమ జిల్లాలోనే 700 కు పైగా కేసులు న‌మోదు చేశారు. కోడి పందేలు నిర్వ‌హించేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీసు పికెట్లు పెడుతున్నారు. సంయుక్త బృందాల‌తో త‌నిఖీలు నిర్వ‌హించ‌డంతో పాటు ఆయా ప్రాంతాల్లో  వీడియో కెమెరాలు, సీసీ కెమ‌రాలు ఏర్పాటు చేశారు. గ‌స్తీ బృందాలు బాడీ ఓన్ కెమారాల‌తో విధులు నిర్వ‌హించాలంటూ ఉన్న‌తాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్ప‌టికే కోడి పందేల బ‌రులు తొల‌గించేందుకు పోలీసులు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను ప్ర‌జాప్ర‌తినిధులు అడ్డుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సంప్ర‌దాయంగా వ‌స్తున్న కోడి పందేల నిర్వ‌హ‌ణ‌ను అడ్డుకోవ‌డం స‌మంజ‌సం కాద‌ని, చ‌ట్ట విరుద్ధంగా నిర్వ‌హిస్తే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇదే విష‌యంలో కృష్ణాజిల్లా పెన‌మ‌లూరు ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్ విజయ‌వాడ జాయింట్ పోల‌స్  క‌మిషన‌ర్ బి.వి ర‌మ‌ణ కుమార్ తో వాగ్వాదానికి దిగారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కూడా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది డింకి పందేలు నిర్వ‌హించినా ఉపేక్షించ‌మంటూ ప‌శ్చిమ గోదావ‌రి ఎస్పీ ఎం. ర‌విప్ర‌కాష్  స్ప‌ష్టం చేశారు. బ‌రులు  ఏర్పాటు చేసిన స్థ‌లం య‌జ‌మానుల‌పై కూడా  కేసులు న‌మోదు చేయ‌నున‌ట్లు ఆయ‌న పేర్కోన్నారు.
ఓ వైపు సుప్రీం తీర్పు పేరిట నిర్వ‌హ‌కులు.. మ‌రో వైపు హై కోర్టు ఆదేశాల పేరిట అధికారులు చేస్తున్న హ‌డావిడి పందెం రాయుళ్ళ‌ను సందిగ్ధానికి గురి చేస్తోంది. సుప్రీం ఆదేశాల మేర‌కు హై కోర్టు స‌వ‌ర‌ణ ఫిటిష‌న్ దాఖ‌లు చేసి అనుమ‌తులు తెచ్చుకోవ‌డంపై వీరు ఆశాభావంతో ఉన్నారు.

ఎక్సైజ్ నిఘా ..!
పందేల నిర్వ‌హ‌ణ‌కు స‌మీపంలో బెల్టు షాపుల ఏర్పాటు చేసి మ‌ద్యం అమ్మ‌కాలు జోరుగా సాగించ‌డం అన‌వాయితీ. దీనిని దృష్టిలో ఉంచుకుని బెల్టు షాపులు ఏర్పాటు చేయ‌కుండా నిలువ‌రించాలంటూ ఆ శాఖ క‌మిష‌ర్ పి. ల‌క్ష్మీ న‌ర‌సింహం ఆదేశాలు జారీ చేశారు. ఆయ‌న ఆదేశాల మేర‌కు ఎక్సైజ్ టీంలు రంగంలోకి దిగాయి. ఇదే స‌మయంలో అక్ర‌మంగా ఏర్పాటు చేసిన బెల్టు షాపుల‌పై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్  అధికారులు విస్తృత దాడులు నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట‌ర్ కె. వెంక‌టేశ్వ‌ర‌రావు  ఆదేశాల మేర‌కు బెల్టు షాపుల నిర్వ‌హ‌ణపై 127 కేసులు న‌మోదు చేశారు. బెల్టు షాపుల‌కు మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేసిన ఆరు షాపుల లైసెన్సుల ర‌ద్దుకు సిఫార్సు చేశారు.