భారీ లంచం కేసులో.. ఏడుకొండ‌ల‌తోపాటు మ‌రో ముగ్గురు అరెస్టు

Posted on : 13/01/2018 11:23:00 pm

రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన వాణిజ్య శాఖ భారీ లంచం కేసులో న‌లుగురిని అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో రాష్ట్ర వాణిజ్య శాఖ ఎన్ఫోర్స‌మెంట్ విభాగం అడిషిన‌ల్ క‌మిష‌న‌ర్ యు. ఏడుకొండ‌లు, ఎన్ఫోర్స్మెంట్  రిఫండ్ విభాగం సూప‌రింటెండెంట్ కె. అనంత‌రెడ్డి, మెస్స‌ర్స్ ఐటిడి సిమెంటేష‌న్ ఇండియా లిమిటెడ్ క‌న్స‌ల్టెంట్, న్యాయ‌వాది ఐ.గోపాల్ శ‌ర్మ, మెస్స‌ర్స్ ఐటిడి సిమెంటేష‌న్ ఇండియా కంపెనీ అకౌంట్స్ విభాగం డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ కె. స‌త్య‌నారాయ‌ణ ఉన్నారు. తొలి రోజు  రూ. 23,20 ల‌క్ష‌ల న‌గ‌దును వాణిజ్య ప‌న్నుల శాఖ కార్యాల‌యం నుంచి స్వాధీనం చేసుకున్న ఏసీపీ అధికారులు.. శ‌నివారం ఐటీడీ కంపెనీ ప్ర‌తినిధులు బ‌స చేసిన స్టార్ హోట‌ల్ గ‌ది నుంచి మ‌రో రూ. 2.50 ల‌క్ష‌లు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల్లో ఏసీబీ అధికారులు రూ. 25.70 ల‌క్ష‌లు స్వాధీనం  చేసుకున్న‌ట్లు ఏసీపీ డీజీ ఆర్.పి ఠాకూర్ తెలిపారు. వాణిజ్య ప‌న్నుల శాఖ‌లో భారీగా లంచం చేతులు మారుతున్న‌ట్లుగా వ‌చ్చిన స‌మాచారంపై కృష్ణాజిల్లా కంకిపాడు మండ‌లం  ఈడ్పుగ‌ల్లులోని రాష్ట్ర వాణిజ్య ప‌న్నుల శాఖ ప్ర‌ధాన కార్యాల‌యంలో శుక్ర‌వారం ఏసీబి అధికారులు త‌నిఖీలు చేసిన విష‌యం తెలిసిందే. మెస్స‌ర్స్ ఐటీడీ సంస్థ‌కు ఇన్ఫుట్ స‌బ్సిడీ ఫైల్ ను ఆమోదించేందుకు ఆ శాఖ ఎన్ఫోర్సెమెంట్ అడిషిన‌ల్ క‌మిష‌న‌ర్ యు. ఏడుకొండ‌లు రూ. 25 ల‌క్ష‌లు లంచం డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని చ‌క్క‌దిద్ది ఫైలుపై సంత‌కం చేయించేందుకు సంస్థ ప్ర‌తినిధి త‌మ క‌న్స‌ల్టెంట్ ను తీసుకుని గురువారం రాత్రి విజ‌య‌వాడ చేరుకొని ఓ స్టార్ హోట‌ల్ లో బ‌స చేశారు. ఈ క్ర‌మంలో ఏసీబీ అధికారులకు భారీగా లంచం చేతులు మారుతున్న‌ట్లుగా స‌మాచారం అంద‌గా వాణిజ్య ప‌న్నుల శాఖ కార్యాల‌యంపై నిఘా పెట్టారు. శుక్ర‌వారం సాయంత్రం ఏడుకొండ‌లు ఛాంబ‌ర్ లో లంచం సొమ్ము చేతులు మారుతుండ‌గా ఏసీబీ సిఐయు అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో దొరికిన న‌గ‌దుతో పాటు న‌లుగురు వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచార‌ణ‌లో భాగంగా హోట‌ల్ గ‌దిలో మ‌రికొంత న‌గ‌దు  ఉన‌ట్లు వ‌చ్చిన స‌మాచారంపై సోదా జ‌రిపిన ఏసీబీ అధికారులు రూ. 2.50 ల‌క్ష‌లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వీరిపై కేంద్ర విచార‌ణ  విభాగం అధికారులు 1988 అవినీతి నిరోధ‌క చ‌ట్టంలోని సెక్ష‌న్ 7,12,13(1) (డి)  రెడ్ విత్ 13(2), ఐపీసీ రెడ్ విత్ 34 సెక్ష‌న్ల  కింద కేసు న‌మోదు చేశారు. అరెస్టు చేసిన వీరిని కోర్టు ద్వారా జ్యుడిషియ‌ల్ రిమాండ్ కు త‌ర‌లించారు.