కుర్చీ ఆటకోసమే రాష్ట్ర విభజన

గత ప్రభుత్వం కుర్చీ ఆట కోసమే రాష్ట్రాన్ని అడ్గగోలుగా విభజించడం జరిగిందని నేడు మరో ప్రతిపక్ష నేత వింత రాజకీయాలకు పాల్పడుతూ గద్దనెక్కాలని అనుకోవడం విడ్డూరంగా ఉందని కేంద్ర విమానాల శాఖ మంత్రి పి. అశోక్ గజపతి రాజు అన్నారు. శనివారం కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గం ఎంపీ మాగంటి బాబు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేడు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఎంతో అవసరమని, లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రాకు అధిక శాతం నిధులు ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత కూడా కేంద్రానికే ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని అందుకే సంవత్సరం తర్వాత ప్రధాని మోదీతో భేటీ అయ్యి రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలను నేరవేర్చాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. అదే విధంగా రాష్ట్రానికి నిధులు ఇచ్చి పోలవరాన్ని త్వరగా పూర్తి చేయాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. పక్క రాష్ట్రం కంటే అతి తక్కువగా మన రాష్ట్రానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. కేంద్రప్రభుత్వం కొన్ని విషయాల్లో సహకరించిందని, మరికొన్ని వషయాల్లో సహకరించలేదని కుండ పగులకొట్టారు. రాజధాని రైతుల త్యాగం మరువలేనిదన్నారు. నేడు రాష్ట్రంలో వింత రాజకీయం మొదలయ్యిందని సీఎం అవుదాం అనే ఆశ ఉండొచ్చు కానీ అత్యాస ఉండకూడదన్నారు. 30 సంవత్సరాలు తానే ముఖ్యమంత్రిగా ఉంటాననని ప్రతిపక్ష నేత చేస్తున్న వ్యాఖ్యలు అతని మూర్ఖత్వానికి నిదర్శనం అని అన్నారు. ప్రజలందరికీ మేలు చేయాల్సిన బాధ్యత మాపై ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత నాయకులదే అని అన్నారు.