అగ్రవర్ణాలకు 10%కు టీఆర్ఎస్ మద్దతు .. లోకసభలో జైట్లీ

Posted on : 08/01/2019 07:28:00 pm


లోకసభ ముందుకు మంగళవారం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ బిల్లు వచ్చింది. బిల్లును కేంద్రమంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ప్రవేశపెట్టారు. 124వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యాంగ సవరణకు ఉభయసభల్లో మూడింట రెండు వంతుల మద్దతు అవసరం. అలాగే, సగం రాష్ట్రాలు దీనిని ఆమోదించాలి. బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి మేలు చేసేందుకు ఈ బిల్లును తీసుకు వచ్చామని చెప్పారు. బిల్లుకు రాష్ట్రాల ఆమోదం అవసరమని చెప్పారు. రాజ్యాంగ పీఠికలోనే సోషలిస్ట్ అనే పదాన్ని జత చేశారని చెప్పారు. కనుక మౌలికస్ఫూర్తిని అడ్డం పెట్టుకొని ఈ బిల్లును అడ్డుకోలేరన్నారు.

సమాన అవకాశాల సూత్రానికి రాజ్యాంగంలోనే మినహాయింపులు ఉన్నాయని జైట్లీ చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగమే చెబుతోందని అన్నారు. రాష్ట్రాల్లో పేదల రిజర్వేషన్ ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పారు. ఈ ప్రయత్నాలు రాష్ట్రాల్లో విఫలం కావడం నిజమేనన్నారు. 

రాష్ట్రాలలో ప్రయత్నాలు అన్ని కూడా నోటిఫికేషన్, సాధారణ చట్టాల ద్వారా జరిగాయని చెప్పారు. 50 శాతం పరిమితి కేవలం కుల రిజర్వేషన్లకే వర్తిస్తుందని చెప్పారు. రిజర్వేషన్ లేనివాళ్లలోని వారికి తమలోని ఆర్థికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్ ఇస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని చెప్పారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో చెప్పిందన్నారు. మేనిఫెస్టో అమలుకు కాంగ్రెస్ కలిసి వస్తుందో లేదో చూడాలన్నారు. 

ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు రిజర్వేషన్ల బిల్లును తాము సమర్థిస్తున్నామని తెరాస లోకసభా పక్ష నేత జితేందర్ రెడ్డి అన్నారు. ఈబీసీ బిల్లును తెరాస సమర్థిస్తోందన్నారు. ఆలస్యమైన అగ్రవర్ణాలకు న్యాయం జరుగుతోందని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ బిల్లుతో ఎంతో ప్రయోజనం అన్నారు. అయితే తెలంగాణలో ముస్లీం రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. రాష్ట్రాలను బట్టి పరిస్థితులు మారుతుంటాయన్నారు. ఇలాంటి దానిని రాష్ట్రానికి వదిలేయాలన్నారు.