పౌరసత్వం బిల్లుకు లోకసభ ఆమోదం

Posted on : 08/01/2019 07:33:00 pm


పౌరసత్వ బిల్లుకు మంగళవారం లోకసభ ఆమోదం తెలిపింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్‌ల నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేలా పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించింది. పై దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారికి మన దేశ పౌరసత్వం కల్పించాలన్న ప్రతిపాదనను ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి.

ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బీజేపీకి నిన్నటి వరకు మిత్రపక్షంగా ఉన్న అసోం గణపరిషత్ వ్యతిరేకించింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూనే ఆ పార్టీ ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్లు తెలిపింది. ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలకు విరుద్ధమైన బిల్లు అని విపక్షాలు పేర్కొన్నాయి. అసోంలో బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. 

అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. దాంతో పాటు దేశంలో చాలా ఏళ్లుగా నివసిస్తున్న వలసదారులకు పౌరసత్వం కల్పించాల్సిన అవసరముందన్నారు. ఇది అసోంకి మాత్రమే సంబంధించినది కాదని, పశ్చిమ ప్రాంతాల నుంచి కూడా చాలామంది వలసదారులు వచ్చారని, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో వాళ్లు స్థిరపడ్డారని, చట్టబద్ధంగా ఉంటున్న వారికి పౌరసత్వం కల్పిస్తూనే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరముందన్నారు.

ఈ బిల్లును హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. ఈ బిల్లు విభజనకు, హింసకు కారణమవుతుందని టీఎంసీ పేర్కొంది. కాగా, ముస్లింలు కాకుండా ఆరు ఇతర మతాల వాళ్లకు భారత పౌరసత్వం ఇవ్వాలన్నది ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. అయితే దేశంలో ఎవరు ఆశ్రయం కోరినా ఇవ్వాలని, ఇందులో ముస్లింలను కూడా చేర్చాలని టీఎంసీ డిమాండ్ చేసింది. బిల్లుకు మద్దతివ్వకపోవడం అసోం గణపరిషత్‌కు సరికాదని బీజేపీ అసోం నేత వ్యాఖ్యానించారు.