కబాలి, కాలా మాదిరిగా నిరాశ ఉండదు.. కార్తీక్ సుబ్బరాజు

Posted on : 08/01/2019 08:48:00 pm


సూపర్‌స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. కబాలి, కాలా, 2.0 చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న రజనీ మరోసారి పేటతో ఆడియెన్స్‌ను పలుకరించేందుకు సిద్ధమయ్యారు. పిజ్జా ఫేం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో పేటా జనవరి 10న రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మీడియాతో సినిమా గురించి వివరించారు. ఆయన ఏమన్నారంటే.. 

పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన కబాలి, కాలా చిత్రాలు అంచనాలను చేరుకోలేకపోయాయి. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన 2.0 చిత్రం రికార్డు వసూళ్లు రాబట్టినా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ కాలేదు. ఈ నేపథ్యంలో మాస్ ఎలిమెంట్స్, రజనీ స్టయిల్ తగినట్టుగా పేటను కార్తీక్ సుబ్బరాజు రూపొందించారు. 

కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ.. దర్శకుడి కంటే ముందు నేను రజనీ అభిమానిని. రజనీ ఫ్యాన్స్‌కు ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమాను నేను పేట రూపంలో అందించబోతున్నాను. పేట చిత్రంలో పాత రజనీకాంత్‌ను చూస్తారు. ఫ్యాన్స్‌ను రజనీ నిరాశపరచరు అని అన్నారు. 

పేట మూవీ రజనీ మాస్ అప్పీల్‌ను మళ్లీ తెస్తుంది. పూర్వ వైభవాన్ని రజనీకి తెచ్చిపెడుతుంది. కాలా, కబాలి మంచి చిత్రాలే కాని ప్రేక్షకులకు కొంత నిరాశ కలిగించాయి. రజనీ సినిమాల నుంచి ఆశించే అంశాలు కొరవడంతో అభిమానులు సంతృప్తి చెందలేదు. 

గత చిత్రాల వల్ల కలిగిన నిరాశలను, అసంతృప్తులను పేట తెస్తుంది. బలమైన, మంచి కంటెంట్‌తో పేటను రూపొందించాను. మాస్ ఎలిమెంట్స్ కథను డామినేట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకొన్నాను. రజనీ క్రేజ్‌ను అందించే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. రజనీ మేనరిజమ్స్ ఈలలు వేయిస్తాయి. గత చిత్రాలకు ధీటుగా పేట సినిమా ఉంటుంది. రజనీ మాస్ ఎలిమెంట్స్ తెరపై శివతాండవం చేస్తాయనే ధీమాను కార్తీక్ సుబ్బరాజు వ్యక్తం చేశారు.