టీఆర్ఎస్ పార్టీ ఫుల్ జోష్..!! క‌ష్టప‌డ్డ వారికి స‌ముచిత స్థానం..!!

Posted on : 09/01/2019 01:20:00 pm


గులాబీ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక స్వల్ప వ్యవధిలోనే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నామినేటెడ్‌ పదవుల పంపిణీకి శ్రీకారం చుట్టబోతున్నారు. సోమవారం నామినేటెడ్‌ ఎమ్మెల్యేగా స్టీఫెన్సన్‌ను నియమించిన కేసీఆర్‌, మంగళవారం పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డిని నియమించారు. రానున్న రోజుల్లో కీలకమైన ఆర్టీసీ చైర్మన్‌, మిషన్‌ భగీరథ వైస్‌చైర్మన్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వంటి కీలక పదవులతో పాటు మరిన్ని నామినేటెడ్‌ పదవుల భర్తీ జరుగుతుందని టీఆర్‌ఎ్‌సలోని ఆశావహులు భావిస్తున్నారు. 

ఎన్నికలకు ముందు వివిధ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌, ఇతర నామినేటెడ్‌ పదవుల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఆయా పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వాటితో పాటు ఖాళీగా ఉన్న నామినేటెడ్‌ పదవులన్నింటినీ భర్తీ చేయాలని టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం భావిస్తోంది. ఈ దఫా రాష్ట్రస్థాయిలో ముఖ్యమైన నామినేటెడ్‌ పదవులను పార్టీ వీర విధేయులకు కట్టబెట్టాలనే తలంపుతో ముఖ్య నేతలు ఉన్నారు. ఈ క్రమంలోనే మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డిని పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ పదవి వరించినట్లుగా టీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన నాయకులకు నామినేటెడ్‌ పదవుల భర్తీలో పెద్దపీట వేయాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం భావిస్తోంది. ఈ మేరకు కొద్ది రోజుల్లోనే మిగిలిన నామినేటెడ్‌ పదవుల్లోనూ ఎక్కువగా పార్టీ నేతలకు కట్టబెడుతూ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు చెబుతున్నారు. అన్ని రకాలు, స్థాయిల్లోని నామినేటెడ్‌ పదవులను పరిగణనలోకి తీసుకుంటే, వాటి సంఖ్య దాదాపు ఐదారు వంద‌ల‌ వరకు ఉంటుందని, పార్టీ కోసం పనిచేసిన వారంద‌రికి అవ‌కాశం ఇవ్వాల‌ని చంద్ర‌శేఖ‌ర్ రావు నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది.