కెజిఎఫ్ హీరో యష్ ఇంటి ముందు నిప్పటించుకుని అభిమాని ఆత్మహత్యాయత్నం!

Posted on : 09/01/2019 01:32:00 pm


కెజిఎఫ్ మూవీ హీరో, కన్నడ రాకింగ్ స్టార్ యష్ పుట్టినరోజు(జనవరి 8) సందర్భంగా కర్నాటకలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. యష్‌ను కలవడానికి వచ్చిన అభిమానిని లోనికి అనుమతించక పోవడంతో మనస్థాపానికి గురైన అతడు హీరో ఇంటి ముందే ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

ఈ చర్యకు పాల్పడిన అభిమాని పేరు రవి. 75 శాతం కాలినగాయాలతో ఉన్న అతడిని వెంటనే బెంగుళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసి షాకైన యష్ వెంటనే ఆసుపత్రికి వెళ్లి రవిని పరామర్శించారు. 

ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అంబరీష్‌కు అత్యంత సన్నిహితుడైన యష్... ఇంకా ఆ విషాదం నుంచి తేరుకోలేదు. అందుకే ఈ సారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అంబరీష్ విషాదంలో ఉన్న యష్... పుట్టినరోజు సందర్భంగా తన అభిమానులను కలవడానికి ఇష్టపడలేదు. సెక్యూరిటీ సిబ్బంది కూడా వారిని లోనికి వెళ్లడానికి అనుమతింక పోవడంతో రవి అనే వీరాభిమాని కలతచెంది ఆత్మహత్య యత్నం చేశారు. 

పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని యష్ నిర్ణయించుకోవడం, రవి అనే అభిమాని ఆత్మహత్యయత్నం సంఘటనతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ ఊహించని సంఘటన కన్నడ ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. యష్ నివాసం సమీపంలో ఉండే హోటల్స్ కూడా... యష్ పుట్టినరోజున భారీగా అభిమానులు తరలి వస్తారని, అమ్మకాలు ఎక్కుగా ఉంటాయని భావించి మామూలు రోజుల్లో కంటే ఎక్కువగా ఫుడ్, బిర్యానీ ప్రిపేర్ చేసినట్లు తెలుస్తోంది. ఊహించని సంఘటనతో అంతా షాకయ్యారు.