నిజాలు చూపిస్తున్నారని భావిస్తున్నా, లక్ష్మీస్ ఎన్టీఆర్ పాట బాధ కలిగించింది: లక్ష్మీపార్వతి

Posted on : 09/01/2019 01:58:00 pm


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ తన తండ్రి జీవిత గాథను ఎన్ని భాగాలుగా తీసినా అది ఎన్టీఆర్ జీవితం సగభాగమే అవుతుందని చెప్పారు.

రాంగోపాల్ వర్మ చిత్రంతో ఎన్టీఆర్ జీవితం పూర్తి చేసినట్లుగా అవుతుందని తెలిపారు. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు సంబంధించిన రెండో పాట తనకు బాధను కలిగించిందని చెప్పారు. రామ్ గోపాల్ వర్మ మనస్సులో ఏముందో ఎవరికీ తెలియదని చెప్పారు. 

ఎన్టీఆర్ జీవితంలోని నిజాలను దర్శకులు రామ్ గోపాల్ వర్మ తెరపైన చూపిస్తారని తాము భావిస్తున్నామని లక్ష్మీపార్వతి చెప్పారు. ఎన్టీఆర్ కుటుంబంతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. బాలకృష్ణ చాలా మంచి వ్యక్తి అన్నారు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబం అంతా కలిసే ఉందని చెప్పారు. 

జయసుధ, జయప్రద, శ్రీదేవి, కృష్ణకుమారి, సావిత్రి, అంజలిదేవి.. వీళ్లందర్నీ వదిలి ఆ లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారని, అంతేకాదు, కుటుంబ సభ్యులను కాదని ఆమెనే ఎందుకు పెళ్లి చేసుకున్నారని ఈ పాటలో ఉంది. ఈ పాట లక్ష్మీపార్వతిని అసంతృప్తికి గురి చేసింది. మేజర్ చంద్రకాంత్ విజయోత్సవ వేదికపైకి లక్ష్మీపార్వతిని ఎందుకు తెచ్చారని,, వైస్రాయ్ గొడవ ఆమె వల్లే జరిగినప్పుడు అక్కడికి కూడా ఆమెను ఎందుకు తీసుకు వచ్చారని, ఆమెకు ముందే పెళ్లైనా ఎదుగుతున్న కొడుకులు ఉన్నా ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నారని ఈ పాటలో ఉంది. 

రాముడు, కృష్ణుడు అని పేరుగాంచిన ఎన్టీఆర్, వెనుక లక్షలాది తెలుగు తమ్ముళ్లు ఉన్నప్పటికీ, రాజకీయ యుక్తి, తిరుగులేని శక్తి అన్నింటిని తులాభారంలో లక్ష్మీపార్వతి ఓడించిందా అని అంటూ ఈ పాటలో ఉంది. సాదాసీద వనిత కోసం ఎన్టీఆర్ సర్వస్వం వదిలిన తెగువ అని పేర్కొన్నారు. ఆమె కోసం రాజే రాజ్యం వదిలిన చరితనా అని పాటలో ఉంది. ఈ పాట చివరలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ఈ పాటలోని ప్రశ్నల వెనుక అబద్దాలుగా చలామణి అవుతున్న నిజాలను, నిజాలుగా మసిపూసుకున్న అబద్దాలను బండకేసి కొట్టి ఉతికి ఆరేయడమే ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ ధేయం అని పేర్కొన్నారు. ఇరవై ఏళ్ళకు పైగా నిజానికి అబద్దం అనే బట్టలు తొడిగి వీధుల వెంట తిప్పుతున్న వెన్నుపోటుదారులు అందరి బట్టలను కళ్లముందు చించి అవతల పారేసి, నిజం బట్టలను ఒక్కొక్కటిగా, మెల్లిగా విప్పి దానిని మళ్లీ పూర్తి నగ్నంగా చూపించడమే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉద్దేశ్యమని పేర్కొన్నారు.