సంక్రాంతి పండుగకు సన్నద్ధం... ఏపీ, తెలంగాణకు స్పెషల్ బస్సులు

Posted on : 09/01/2019 04:21:00 pm


సంకాంత్రి పండుగ సందడి మొదలైంది. హైదరాబాద్‌లో నివాసముండే రెండు రాష్ట్రాల ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. హైదరాబాద్ నుంచి తెలంగాణవ్యాప్తంగా 3,673 జిల్లా సర్వీసులు నడపనున్నారు. అటు ఏపీకి 1,579 స్పెషల్ బస్సులు కేటాయించారు. రెగ్యులర్ బస్సులతో పాటు అదనంగా ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచారు.

హైదరాబాద్ కేంద్రంగా సంక్రాంతి పండుగకు స్పెషల్ బస్సులు కేటాయించారు టీఎస్ఆర్టీసీ అధికారులు. ప్రధానంగా ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టేషన్ల నుంచి ఇవి నడుస్తాయి. అలాగే ప్రయాణీకులకు ఇబ్బందులు తలెత్తకుండా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులు రన్ చేయనున్నారు. మియాపూర్, కేపీహెచ్‌బీ, చందానగర్, లింగంపల్లి, జీడిమెట్ల, ఎల్బీ నగర్, ఉప్పల్, తార్నాక, ఈసీఐఎల్, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట, కాచిగూడ, లక్డీకాపూల్ లోని టెలిఫోన్ భవన్ తదితర ప్రాంతాల నుంచి బస్సులు నడపనున్నారు. టీఎస్ఆర్టీసీ పరిధిలోని ఆధీకృత బుకింగ్ ఏజెంట్ల దగ్గర నుంచి కూడా స్పెషల్ బస్సులు నడిపేలా ప్లాన్ చేశారు.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో నడపనున్న ప్రత్యేక బస్సులు ఈనెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఈ స్పెషల్ బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించారు. వోల్వో బస్సులతో పాటు అంతర్ రాష్ట్ర బస్సులను ప్రధాన బస్ స్టేషన్ల నుంచి నడిపించనున్నారు. మిగతా ప్రాంతాల నుంచి ఇతరత్రా బస్సులు ప్రొవైడ్ చేయనున్నారు. ఆన్‌లైన్ రిజర్వేషన్ కోసం www.tsrtconline.in వెబ్ సైట్ సంప్రదించాలని సూచించారు ఆర్టీసీ అధికారులు. అలాగే బస్టాండ్లతో పాటు ఆధీకృత డీలర్ల దగ్గర కూడా టికెట్లు లభిస్తాయని తెలిపారు.

సంక్రాంతి రద్దీ దృష్ట్యా టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు రన్ చేస్తోంది. అందులోభాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు స్పెషల్ బస్సులు ప్రొవైడ్ చేసింది. 
అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కనిగిరి, కందుకూరు, పామూరు, పొదిలి, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, విజయవాడ, విజయనగరం, తెనాలి, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు, గుడివాడ, పోలవరం వైపు అదనంగా బస్సు సర్వీసులు నడపనున్నారు.