ఒడిశా సీఎం నుంచి కేసీఆర్‌కి తీపి కబురు!

Posted on : 09/01/2019 07:26:00 pm


సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో రాజకీయ పార్టీల సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని ఎన్డీయే భావిస్తుండగా, బీజేపీని గద్దె దించాలని బీజేపీయేతర కూటమి ప్లాన్ చేస్తోంది. ఈ రెండింటికీ దూరంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ చకచకా అడుగులేస్తోంది. తాజాగా జాతీయస్థాయిలో ఏర్పాటు చేయతలపెట్టిన మహాకూటమిలో చేరే ఆలోచనలేదని క్లారిటీ ఇచ్చేశారు బిజు జనతాదళ్ అధినేత, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహాకూటమిలో చేరబోమని స్పష్టంచేశారు. రెండు ప్రధాన పార్టీలకు తాము దూరమని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. ఇదే సమయంలో ఫెడరల్ ఫ్రంట్‌లో చేరుతారా లేదా అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు సీఎం నవీన్.

ఒడిశాలో బీజేడీ ఒక్కటే బలమైన ప్రాంతీయ పార్టీ. మిగతా స్పేస్‌ని కాంగ్రెస్, బీజేపీ షేర్ చేసుకుంటున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేడీ-20 ఎంపీ సీట్లను గెలుచుకోగా, బీజేపీ ఒక్క సీటు దక్కించుకుంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా నవీన్ పట్నాయక్ సీఎంగా వుండడంతో ఆయనపై వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవాలని జాతీయపార్టీలు ఆలోచన చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలతోపాటే ఏపీ, ఒడిషా శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో మెజార్టీ సీట్లు బీజేడీ గెలుచుకుంటే ఓకే.. లేకుంటే జాతీయ పార్టీపై ఆధారపడాల్సిన పరిస్థితి ఆ పార్టీది. రేపటిరోజున కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియక, ముందుగానే దూరం పాటిస్తున్నారు సీఎం నవీన్‌.

ఈవిధంగా.. పోస్ట్-పోల్ అలయెన్స్ మీద మాత్రమే దృష్టి పెట్టేసినట్లు నవీన్ పట్నాయక్ సిగ్నల్స్ ఇచ్చేశారు. రేపటిరోజున తనకు పూర్తి మెజారిటీ వచ్చి.. చేతినిండా ఎంపీ సీట్లు దక్కితే.. ఆయన చేతిలో ప్లాన్B ఉండనే వుంది. కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ ఫార్ములా వైపు నవీన్ పట్నాయక్ మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. ఈ పరిణామం.. కేసీఆర్ 'నేషనల్ థాట్'ని ఎంకరేజ్ చేసేదే!