సింబా కలెక్షన్ల దూకుడు.. 250 కోట్లపై కన్నేసిన రణ్‌వీర్ సింగ్

Posted on : 09/01/2019 07:31:00 pm


టెంపర్ రీమేక్‌గా సింబా పేరుతో రిలీజైన బాలీవుడ్ చిత్రం వసూళ్ల పరంగా దూసుకుపోతున్నది. రిలీజ్ తర్వాత 12వ రోజున కూడా భారీ వసూళ్లను సాధిస్తూ అరుదైన ఫీట్‌ను సాధించింది. మొదటి రోజు నుంచి సానుకూలమైన టాక్‌తో దూసుకెళ్తున్న ఈ చిత్రం తాజాగా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. సింబా 12 రోజుల కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. 

రణ్‌వీర్ సింగ్, సారా అలీ ఖాన్ జంటగా నటించిన సింబా చిత్రం 12వ రోజున కూడా భారీగానే వసూళ్లు సాధించింది. ఈ చిత్రం మంగళవారం రూ.6.03 కోట్లు వసూలు చేసింది. దాంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.202.83 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పట్లో వసూళ్లు తగ్గే ప్రసక్తి లేదని వారు పేర్కొంటున్నారు. 

సింబా రెండో వారంలో ప్రవేశించిన తర్వాత నిలకడగా కలెక్షన్లు సాధిస్తున్నది. శుక్రవారం రూ.9.02 కోట్లు, శనివారం రూ.13.32 కోట్లు, ఆదివారం రూ.17.49 కోట్లు, సోమవారం రూ.6.16 కోట్లు, మంగళవారం రూ.6.03 కోట్లు సాధించింది. దాంతో రూ.200 కోట్ల అరుదైన రికార్డు సాధించింది అని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. 

సింబా చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే రూ.100 కోట్లు సాధించింది. 2018లో విడుదలైన చిత్రాల్లో రూ.200 కోట్లు సాధించిన మూడో చిత్రంగా ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. రానున్న రోజుల్లో ఈ చిత్రం రూ.250 కోట్ల మైలురాయిని అందుకొనే అవకాశం లేకపోలేదనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. 

సింబా చిత్రం 200 కోట్ల మైలురాయి ప్రయాణం ఇలా ఉంది. మూడో రోజున రూ.50 కోట్లు, 5 రోజుల్లో రూ.100 కోట్లు, 7 రోజున రూ.150 కోట్లు, 10 రోజున రూ.175 కోట్లు, 12 రోజున రూ.200 కోట్ల మైలురాయిని దాటింది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన చిత్రాలు ఓ రికార్డును సొంతం చేసుకొన్నాయి. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన 8 చిత్రాలు వరుసగా రూ.100 కోట్లు వసూళ్లు చేయడం విశేషం.