పల్లెల్లో పవన్ జీరోనేనా?

Posted on : 19/01/2018 12:38:00 am

పల్లెల్లో పవన్ జీరోనేనా? అంటే ఆ ప్రశ్నకి ఔననే సమాధానం చెప్తున్నాయి సర్వేలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కింగ్‌మేకర్ పాత్ర పోషిస్తారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో మాదిరే 2019 ఎన్నికల్లోనూ పవన్.. వైకాపా ఓట్లను చీల్చి, చంద్రబాబుకు మేలు చేస్తారని అంటున్నారు. అయితే వైకాపాకు ప్రచార వ్యూహాలు రచిస్తున్న ప్రశాంత్ కిశోర్ చేయించిన సర్వే మాత్రం ఈ వాదనను తోసిపుచ్చింది.

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అసలు జనసేన పార్టీ ఒకటి ఉందనే విషయమే తెలియదని ప్రశాంత్ కిశోర్ సర్వేలో తెలిసినిట్లు వైకాపా నేతలు చెబుతున్నారు. పవన్‌కు కేవలం సినిమా నటుడిగానే గుర్తింపు ఉందని, అతడు విశ్రాంతి సమయంలో ప్రజాసమస్యలపై మాట్లాడుతుంటారు తప్పిస్తే అతనికొక పార్టీ, ప్రణాళిక ఉందన్న విషయం ప్రజలకు తెలియదని సర్వేలో తేలిందంటున్నారు.

పత్రికలు, సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో జనసేన గురించి కుక్ద్ అప్ వార్తలే ఎక్కువగా వస్తున్నాయని, అయితే క్షేత్రస్థాయిలో ఆ పార్టీ ఉనికి నామమాత్రమేనని పేర్కొంటున్నారు. ‘పవన్ ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసే ప్రసక్తేలేదు. అసలు ఆ పార్టీ ఎక్కడ పోటీ చేసినా గెలవదు. ఒక్క సీటు కూడా రాదు. రాయలసీమలో పోటీ చేసే పరిస్థితే లేదు’ అని సర్వే చెబుతోందన్నారు. దీంతో వైకాపా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.