ఏడు పదుల వయసులోనూ వన్నె తగ్గని ఆత్మవిశ్వాసం

Posted on : 23/01/2018 06:51:00 pm

ఏడు పదుల వయసులోనూ ఏదో చెయ్యాలనే తపన, తినడానికి లోటు లేకున్నా, పది మందికి అన్నం పెట్టే రైతు కుటుంబంలో పుట్టి పెరగడం, తండ్రి బాపూజీ అడుగు జాడల్లో నడవడం ఇవన్నీ ఆమెకు సమాజం పట్ల ప్రేమను పెంచాయి. మనిషిగా పుట్టినందుకు మనుషులకు ఏదో చెయ్యాలనే తపనే సుమారు డెబ్బై సంవత్సరాల వయసులోనూ ఆమె చలాకీగా పనిచేయగలుగుతుంది.

ఆమె పేరు విజయ లక్ష్మి గుంటూరు జిల్లా బట్టి ప్రోలు మండలం పెద పులివర్రు గ్రామం. చుట్టు పక్కల ప్రాంతాలలో పచ్చళ్లు లక్ష్మి అంటే పెద్ద బ్రాండ్. తన పచ్చళ్ల వ్యాపారం ద్వారా ప్రత్యక్షంగా సుమారు ఇరవై కుటుంబాలను పోషిస్తోంది. పరోక్షంగా మరెన్నో కుటుంబాలు ఈ వ్యాపారం ద్వారా జీవనోపాదిని పొందుతున్నాయి. ఆమె చేసిన పచ్చళ్లను చూడగానే నాలుక జివ్వు మంటుంది. ఆమెతో మాట్లాడితే ఆమె ఆత్మ విశ్వాశానికి చెయ్యెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే? ఆమెది పది మందికీ పెట్టే చెయ్యి, ఆమెది తన చుట్టూ ఉన్న పది మంది కడుపు నింపే మనసు. వయసుపైబడుతున్నా అదే ఆత్మ విశ్వాశం, ఎన్ని వేల రూపాయల ఖరీదైన పచ్చళ్లు ఆర్డర్ వచ్చినా కూడా, రూపాయి కూడా అడ్వాన్స్ తీసుకోకుండా మనిషిని మాత్రమే నమ్మే గొప్ప మనిషి. ఆమెను చూస్తే నమ్మకం కూడా చిన్నబోతుంది నమ్మకమైన నేనే నమ్మను ఈ మనుషులను, అలాంటిది ఈ మనిషికి ఇంత నమ్మకమేంటి? ఈ మనుషులపై అని.

సాంప్రదాయక కుటుంబంలో పుట్టిన విజయ లక్ష్మిగారికి ఖాధీ అన్నా ప్రాణమే! పద్నాలుగేండ్ల క్రితం ముఖ్య మంత్రి చంద్రబాబు పిలుపు మేరకు సాంప్రదాయక కుటుంబం అనే కట్టు బాట్లను తెంచుకొని పది మందికి మంచి చెయ్యాలనే ఉద్దేశ్యంతో పచ్చళ్ల తయారీకి ముందు కొచ్చింది. దాదాపు పదహారు రకాలైన పచ్చళ్లు, హైదరాబాద్ ఎర్ర గడ్డ రైతు బజార్లో స్టాల్, పచ్చళ్ల తయారీలో ఎర్రకారంతో పాటు మమకారాన్ని సైతం కలిపి మరీ తయారు చేస్తుందేమో వాటికి అందుకే అంత రుచి. వ్యాపారం ప్రారంభించడానికి ముందు ఎంతో మంది ఆమెను హెచ్చరించారు, పచ్చళ్ల వ్యాపారంలో ఆస్తులు అమ్ముకున్న వాళ్ల జీవితాలను ఆమె సన్నిహితులు కథలు కథలుగా చెప్పారు. అయినా సరే ఆమె వెనుకడుగు వెయ్యలేదు.

సైకిల్ మీద తిరిగి ప్రియా పచ్చళ్లను అమ్మిన రామోజీరావు కంటే పెద్ద కథలా? వీళ్లు చెప్పేవన్నీ అని అనుకుందేమో తను, వానలో తడిస్తే తుమ్ములు, ఆడ పిల్ల తెగిస్తే విమర్శలు సర్వసాధారణమే కదా మన సమాజంలో, అసలే పల్లెటూరు వాతావరణం, సాంప్రదాయ కుటుంబం, ఇవన్నీ భరించింది, తెగించింది, సాధించింది. చెవులు కొరుక్కున్న వాళ్లే సెల్యూట్ చేశారు, విమర్శించిన నోళ్లే వేనోళ్లా పొగిడాయి. సహకరించిన చేతులో చప్పట్లు కొట్టాయి విజయమ్మ సాధించిన విజయానికి. ఎక్కడ ఫుడ్ ఎగ్జిబిషన్ జరిగినా మగాళ్లకు సైతం దీటుగా ఆమె ప్రోడెక్టులు ప్రదర్శనలో ఉంచబడేవి. జిల్లా అధికారులు సైతం నివ్వెర పోయేవారు ఆమె పచ్చళ్ల రుచిని, ఆమె పడే శ్రమను చూసి. ఆమె నినాదం వింటే ఆశ్చర్యం వేస్తుంది ఎవ్వరికైనా. రూపాయికి రూపాయి లాభం నాకొద్దు పావళా వాటా నాకుంటే మిగతాదంతా నాతో శ్రమించే వాళ్లకు ఉండాలంటుంది. ఒంటరిగా వ్యాపారం ప్రారంభించిన తొలినాళ్లలో ఎన్నో ఎదురు దెబ్బలు, కాలు విరిగి రెండేళ్ల పాటు మంచానికే పరిమితమైంది అయినా నిరుత్సాహ పడలేదు, తనలా చేయి తిరిగిన శిష్యులను తయారు చేసుకుంది, పచ్చళ్ల తయారీ ఆగకుండా చూసింది. మంచంలో పడిన రెండేళ్ల తరువాత తనూ లేచి నిల్చుంది, ఈ రెండేళ్లలో తన వ్యాపారాన్ని సైతం నిల్చోబెట్టింది. ఈ వ్యాపారంలో కోట్ల రూపాయల పెట్టు బడి పెట్టే వ్యాపారులు సైతం ఈమె వద్దకు సలహాలకోసం వస్తారు. వాళ్లకు విజయలక్ష్మిగారు ఇచ్చే సలహా ఏంటో తెలుసా? "నిధానంగా చెయ్యు నమ్మకంగా చెయ్యు" అదే నిన్ను నిలబెడుతుంది, ఇదే ఆమె విజయ రహస్యం, ఇదే ఆమె వ్యాపార సూత్రం. గెలవడానికి అడ్డదారులు తొక్కాల్సిన పని లేదు, గెలిచినోడి కాళ్లకు మొక్కాల్సిన పని లేదు, నీ కాళ్లను నువ్వు నమ్ముకో నీ చేతులు వాటికవే పని చేస్తాయి అనే మాటలు విజయలక్ష్మి గారి విషయంలో అక్షర సత్యాలు.

ఈ వ్యాపారాన్ని విస్తరించడానికి సన్నాహాలు చేస్తోంది తను మరో ముప్ఫై లక్షల రూపాయలతో, ఉన్నత చదువులు చదువుకున్న తన మనుమళ్లను భాగస్వామ్యులను చేసి, ఇప్పుడు చెప్పండి వ్యాపారంలో గెలవాలంటే బిజినెస్ మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ చెయ్యాలా? పది మందికి అన్నం పెట్టాలనే సంకల్పం ఉంటే సరిపోదా? కోట్ల రూపాయలు పెట్టు బడులు పెట్టి నమ్మకాన్ని నమ్మక నేలపాలైన ఎందరికో ఈమె ఓ వ్యాపార విశ్వవిద్యాలయం కాదా? ఇప్పుడున్న అంబానీలు నాన్న నుంచి వ్యాపార వారసత్వాన్ని పునికి పుచ్చుకుంటే, పెద్దగా చదువుకోని ఈమె కార్పొరేట్ చదువులు చదువుకున్న ఎందరికో స్ఫూర్తి కాదా..నిజమైన ఆరడుగుల బుల్లెట్ మన పచ్చళ్ల విజయలక్ష్మే! సెల్యూట్ అమ్మా చదువుకొని ఉద్యోగం లేదని నిరాశకు గురై ప్రాణాలు తీసుకుంటున్న నేటి యువతకు మీరు ఆదర్శం కావాలి మిమ్మల్ని చూసి ఈ తరం స్ఫూర్తి పొందాలి, ఎర్ర కారంతో పాటు మమకారం కలిపిన తెలుగు పచ్చళ్ల రుచి విశ్వవ్యాప్తం కావాలని పక్షం కోరుకుంటోంది.