గణతంత్ర ఘనత ఇదే..!

Posted on : 26/01/2018 12:00:00 am

దేశం ఎలా ఉండాలో తెలియక పోయినా.. మనం ఎలా వున్నాము అని ఆలోచించకపోయినా..

దేశం,మనం ఇలా ఉండాలి అనుకున్న ఈ రోజును మాత్రం గుర్తు పెట్టుకున్నాం.

మనం ప్రతిరోజూ విమర్శిస్తూ ప్రతిక్షణం ప్రశ్నిస్తూ ఒక్కనాడు మాత్రం జైహింద్ అంటూ సెల్యూట్ కొడతాం.

కులం గుర్తొచ్చినా మతం గుర్తొచ్చినా తనకు ఏ సుఖం గుర్తొచ్చినా తనవల్లె పొందలేకపోయాము అని బాధపడుతుంటాం.

ఉన్నత చదువులు చదవలేకపోయినా, ఉద్యోగం దొరకకపోయినా తననే తిట్టుకుంటాం.

అయినా కూడా ఈ ఒక్క రోజు తనకి సెల్యూట్ కొడతాం.

ఏ రోజు రాజ్యాంగాన్ని గౌరవించనివాడు కూడా తన వరకు వచ్చినప్పుడు నేనూ పౌరుడిని అంటూ రొమ్ము విరిచి నేను భారతీయుణ్ణి అంటాడు.

రాజ్యాంగం తను పుట్టినరోజునే చెప్పింది తనను మంచిగా మార్చమని మార్చుకోమని తనకు మార్పు ఇష్టమని.

"అయితే తనను మార్చేది ఎవరు? మంచిగా మలిచేదెవరు?"

ఎవరు ఎలా వున్నా తను మాత్రం ఎప్పటికీ తనలానే వుంటుంది.

ఎవరు మారినా మారక పోయినా ప్రతిరోజు తను మారుతూనే వుంటుంది. ప్రతివాడి అవసరాన్ని తీరుస్తూనే వుంటుంది.

మతం కోసం, కులం కోసం, మంచి నుండి చెడు కోసం, చెడు నుండి మంచి కోసం, పేదవాడి కోసం వున్నోడి కోసం, ఆడ కోసం, మగ కోసం, మనందరికోసం అరవైతొమ్మిది ఏళ్లుగా  సవరణలు పొందుతూనే వుంది.

ఇన్ని సార్లు మారినా ఎన్ని సవరణలు చేసినా ఇప్పటికీ ఆగని ఆకలి చావులు, వేధింపులు, హత్యలు, మానభంగాలు.

ఎవ్వరినైన ప్రశ్నించాలంటే నేను పౌరుడిని అనే హక్కు గుర్తొస్తుంది. "కాని బాధ్యత గుర్తురాదు."

ఏం మాట్లాడినా భావప్రకటనా స్వేఛ్చ అంటాం. "కాని అదే స్వేచ్ఛను ప్రేమను అందరికి పంచి ఇవ్వం"

స్వార్ధం మన నైజం. సమాజం మనకు వైరం. చేయూత లేదంటాం. అభివృద్ధి రాదంటాం. కారణం రాజ్యాంగం అంటాం.

తనని మారుస్తుంది మనమే. తిరిగి రాస్తుంది మనమే.

మనలో జరిగే ప్రతి మార్పుకి తను మారాలని రాసుకుంది మనమే. అయనా మనకు అసంతృప్తే.

పాపం పిచ్చి తల్లి. ఇన్నిసార్లు మనం చేసిన తప్పులను భరిస్తూ ఈ ఒక్కరోజు  సంబరం తో మురిసిపోతుంది.

" జనవరి 26 ప్రపంచానికి ఓ రోజు కావచ్చు కాని ఇంత పెద్ద వ్యవస్థకు రూపకల్పన జరిగిన రోజు అని మాత్రం ఎప్పటికీ మరవకూడదు.

తన భాద్యతను గుర్తించలేని వాడికి రాజ్యాంగాన్ని ప్రశ్నించే హక్కు లేదు."

జై హింద్.