ఆ హీరో నిజంగానే హీరో

Posted on : 06/02/2018 08:55:00 am

ఆంధ్రాకు ప్రత్యేక హోదా కావాలంటూ ట్వీట్ చేసిన యంగ్ హీరో నిఖిల్ మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్న సందర్భంలో అక్కడి ప్రజలు ఆకాంక్ష తెలుసుకున్నానని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అవసరమని నిఖిల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసింది. నిఖిల్ ట్వీట్‌కు పెద్ద ఎత్తున స‍్పందన వచ్చింది. వేలాదిగా రీ ట్వీట్లు, లైకులు, కామెంట్లు రావటంతో నిఖిల్ ఈ విషయంపై మరోసారి స్పందించారు.

‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ నాకు ట్వీట్‌ చేస్తున్న వారందరికీ నా రిక్వెస్ట్. ఎవరూ హింసాత్మక నిరసనలను ప్రోత్సహించవద్దు. ఇప్పుడు ధర్నాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. మన చేతిలో బలమైన ఆయుధం ఉంది. 2019 ఇంకెంతో దూరంలో లేదు. అధికారంలో ఉన్నవారు ఈ విషయం గుర్తించాలి’ అంటూ ట్వీట్ చేశారు నిఖిల్. ప్రముఖ దర్శకుడు మలినేని గోపిచంద్ కూడా ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ ట్వీట్ చేశారు. ‘కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవం పోయటం కేంద్ర ప్రభుత్వ కనీస ధర్మం’ అంటూ ట్వీట్ చేశారు గోపిచంద్‌. స్టార్ రైటర్‌ కోన వెంకట్‌ ‘మీ మాట నిలబెట్టుకొమ్మని మాత్రమే కోరుతున్నామం’టూ ట్వీట్ చేశారు. ప్రస్తుత రాజకీయాలను, సామాజిక అంశాలను అవగాహన చేసుకోవడమే కాకుండా ఒక పరిణతితో కూడిన ట్వీట్ చేసిన హీరో నిఖిల్, జనం దృష్టిలో నిజంగానే హీరో అనిపించు కున్నాడు.