భగ్గున రగిలిన సీమ - గొడ్డళ్ళకు పని చెప్పిన వైసీపీ

Posted on : 07/02/2018 09:28:00 am

కర్నూలు, ఆదోని : రెండు వర్గాల మధ్య జరిగిన దాడి స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది. పాత కక్షల నేపధ్యంలో ఈ దాడి జరిగిందని వార్తలొస్తున్నాయి. ఆదోని మండలం దిబ్బనకల్లులో టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు మారణాయుధాలతో దాడికి పాల్పడి తీవ్రంగా గాయపర్చిన ఘటనతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

మంగళవారం హుసేనప్ప తాత ఉరుసు సందర్భంగా టీడీపీ వర్గీయుడయిన సర్పంచ్‌ లక్ష్మి భర్త లక్ష్మన్న, వారి బంధువులు నాగరాజు, లక్ష్మి, నాగార్జున, నర్సమ్మ గ్రామస్థులకు భోజనాలు పెడుతున్నారు. వైసీపీ వర్గీయులు నాగరాజు, అర్జున్‌ రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలపడంతో వాటిని పక్కకు పెట్టాలని లక్ష్మన్న కోరాడని ఈ విషయానికే ఆగ్రహించిన  వైసీపీ వర్గీయులు భరత్‌, పవన్‌, అనిల్‌, వీరేష్‌, నాగేంద్ర, మల్లికార్జున, హనుమంతు వేటకొడవళ్లు, గొడ్డళ్లతో లక్ష్మన్నపై ఉద్దేశ్య పూర్వకంగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
అడ్డు వచ్చిన మరికొంత మంది పైన కూడా దాడికి పాల్పడ్డారని బాధితులు ఆవేదన చెందుతున్నారు.


గతంలో దిబ్బన కల్లు గ్రామంలో వైసీపీ కి చెందిన హనుమంతు రేషన్ డీలర్ గా ఉండేవాడని, ఆటైంలో రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా ఆర్డీవో ఓబులేష్‌, అప్పటి తహసీల్దార్‌ శ్రీనివాసరావు పట్టుకొని డీలర్‌షిప్ ని రద్దు చేయడం జరిగింది. కాగా అది మనసులో ఉంచుకున్న హనుమంతు పథకం ప్రకారంగా దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. తమను తుది ముట్టించాలనే పథకం ప్రకారం మారణాయుధాలతో దాడి చేశారని లక్ష్మన్న మీడియా ముందు చెప్పాడు.
 
మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు ఏరియా ఆస్పత్రికి చేరుకుని గాయపడ్డ వారిని పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. టీడీపీ వర్గీయులపై దాడి జరిగిందని తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున ఆస్పత్రికి చేరుకొన బాధితుల్ని పరామర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.