గనుల గ"లీజ్"కు సుప్రీం చెక్

Posted on : 07/02/2018 12:45:00 pm

మైనింగ్.. నేలను గుల్ల చేస్తూ లక్షల కోట్లను కొల్లగొడుతున్న కథలు మన దేశంలో అనేకం. పరిమితులను ఉల్లంఘించి పర్యావరణానికి చేటుచేస్తున్న కంపెనీలపై సుప్రీంకోర్టు ఉక్కు పాదం మోపే దిశగా చర్యలు తీసుకొంటోంది . ఈ క్రమంలో భాగంగా గోవా లోని మైనింగ్ కంపెనీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తాజాగా సంచలన నిర్ణయం వెల్లడించింది. దీంతో గోవా మైనింగ్ కు ముక్కు తాడు పడనుంది.

గోవాలో మైనింగ్‌ కంపెనీలకు సుప్రీంకోర్టు భారీ షాక్‌ ఇచ్చింది. గోవాలో అన్ని ఖనిజాల తవ్వకాలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం వెల్లడించింది. పర్యావరణ ఉల్లంఘనల నేపథ్యంలో ఇనుప ఖనిజం గనుల లీజును రద్దు చేస్తూ బుధవారం తీర్పునిచ్చింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్సు పొందిన తరువాత మాత్రమే కొత్త లీజుకు అనుమతిని ఇవ్వాలని కోర్టు పేర్కొంది. మార్చి 15 నుంచి లీజింగ్‌ ఆపరేషన్లు నిలిపివేయాలని ఆదేశించింది. అలాగే తాజా పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్రాన్నికోరింది. గోవా ఫౌండేషన్‌ (ఎన్‌జీవో) దాఖలు చేసిన ఫిర్యాదును విచారించిన సుప్రీం తాజా ఆదేశాలిచ్చింది.

జస్టిస్‌ మదన్‌ బి. లో​కూర్‌, జస్టిస​ దీపక్‌ గుప్త ఆధ్వర్యంలోని  సుప్రీం బెంచ్‌ గనుల తవ్వకంపై రెన్యువల్‌ రెండవ దశలో గోవా ప్రభుత్వం అనుమతినిచ్చిన  లైసెన్సులను అన్నింటిని రద్దు చేసింది. దాదాపు 88 మైనింగ్ లీజులను సుప్రీం రద్దు చేసింది. మార్చి 16 తరువాత మైనింగ్‌ చేయడానికి వీల్లేదని మైనింగ్‌ కంపెనీలను అందేశించింది. అలాగే కొత్త బిడ్డింగ్‌ నిర్వహించాలని చెప్పింది.

కాగా 2012,అక్టోబరు లో రాష్ట్రంలో  మైనింగ్‌ లీజ్‌లను సుప్రీం కోర్టు సస్పెండ్ చేసింది, జస్టిస్ ఎంబీ షా కమిషన్ సమర్పించిన నివేదికను అనుసరించి, లక్షలాది టన్నుల ఇనుప ఖనిజం చట్టవిరుద్ధంగా తవ్వినట్లు గుర్తించింది. కాగా 2015 లో, అక్రమ మైనింగ్ ఆరోపణలున్న అదే హోల్డర్లకు గోవా ప్రభుత్వం గనుల తవ్వకానికి దాదాపు 20 సంవత్సరాల పాటు అనుమనితిచ్చింది. గనుల లీజుల ఆలస్యంతో రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టాన్ని కలిగించారనే ఆరోపణలతో ఇటీవల గోవా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు దిగంబర కామత్‌పై గోవా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.