విషయం ఒక్కటే ఏపీలో ఆపరేషన్లే రెండు

Posted on : 08/02/2018 09:47:00 am

బాపట్ల టౌన్‌: గన్నవరంలోని నిర్మితమవుతున్న జాతీయ విఫత్తుల కేంద్రాన్ని తాత్కాలిక ప్రాతిపదికన గుంటూరు జిల్లా బాపట్లలో ఏర్పాటు చేసినట్లు ఎన్ఐడీఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిపిన్ మాలిక్ తెలిపారు. ఏపీ పునర్‌ విభజన చట్టంలోని నిబంధనల మేరకు జాతీయ విపత్తుల నివారణ కేంద్రానికి ప్రభుత్వం గన్నవరంలో 10 ఎకరాల భూమి కేటాయించిందని కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి, ఎన్‌ఐడీఎం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బిపిన్‌మాలిక్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జాతీయ విపత్తుల నివారణపై మూడు రోజుల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బిపిన్‌మాలిక్‌ మాట్లాడుతూ దక్షిణ భారత జాతీయ విపత్తుల నివారణ కేంద్రాన్ని బాపట్ల మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో తాత్కాలికంగా ఏర్పాటుచేసినట్లు చెప్పారు.

గన్నవరంలో శాశ్వత భవనాల నిర్మాణం ఆలస్యం అవుతున్నందువల్ల మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో తాత్కాలిక భవనాల్లో ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రంలో జాయింట్‌ అసిస్టెంట్‌ ఆఫీసర్‌ స్థాయి అధికారి ఉంటాడని తెలిపారు. తుఫాన్‌లు, భూకంపాలు, వరదలు, సునామీలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలకు ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు ముందస్తుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆయన వివరించారు. మూడు రోజుల శిక్షణ తరగతుల్లో మొదటి రోజు దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ అధికారులకు, రెండో రోజు సముద్రతీర ప్రాంత ప్రజలకు, చివరి రోజు స్వచ్ఛంద సేవాసంస్థలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
 
శిక్షణ పొందిన అధికారులు జాతీయ విపత్తులు సంభవించినప్పుడు ముందస్తుగా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై అవగాహనను కల్పించాలన్నారు. వేసవిలో 48 డిగ్రీలు ఉష్ణోగ్రతలు సముద్రతీర ప్రాంతంలో నమోదవుతున్నాయని, వాటిపై ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో తాత్కాలిక భవనాలను పరిశీలించి ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. బాపట్ల పట్టణంలో దక్షిణ భారత జాతీయ విపత్తుల నివారణ కేంద్రాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేసినందుకు ఫోరం ఫర్‌ బెటర్‌ బాపట్ల కార్యదర్శి పీసీ సాయిబాబు, తహసీల్దార్‌ తిరుమలశెట్టి వల్లయ్య ఆయనకు పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో హార్యానా రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ కృష్ణమోహన్‌, ఏపీఎస్‌డీఎంఏ సీఈవో శేషగిరిరావు, ఎన్‌ఐడీఎం జాయింట్‌ డైరెక్టర్‌ ఆర్‌కె.సింగ్‌, ఎస్‌ఐడీఎం శిక్షణాధికారి అనీల్‌షేకావత్‌ తదితరులు పాల్గొన్నారు.