ఉంపెడు గత్తె వివరాలనూ ఆన్లైన్ చేయాల్సిందే

Posted on : 08/02/2018 10:04:00 am

హైదరాబాద్‌: పోలీసు వ్యవస్థ రోజురోజుకీ ఎలా దిగ జారి పోతోందో చెప్పడానికి ఈ సర్వేనే ఒక ఉదాహరణ. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే ప్రతి ప్రశ్న ఈ సర్వే పత్రాల్లో పొందుపరచబడ్డాయి. చివరకు ఎంత నీచానికి దిగజారారంటే ఆస్తుల ఆన్లైన్ విధానం నుంచి అక్రమ సంబంధాలను సైతం ఆన్లైన్ చేసే విధానానికి శ్రీకారం చుట్టారు హైదరాబాద్ పోలీసులు.

వివరాల్లోకి వెళ్తే..

సకల నేరస్తుల సర్వే పేరుతో పోలీసులు అవసరం లేని విషయాలను అడుగుతుండటాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సర్వే పేరుతో ఓ వ్యక్తి వద్దకు వెళ్లి అతనికి ఓ నమూనా పత్రం ఇచ్చి, అందులో నీ న్యాయవాది ఎవరు? నీకు తాకట్టుపై అప్పు ఇచ్చే వ్యక్తి ఎవరు? నీ ఉంపుడుగత్తె ఎవరు తదితర వివరాలను భర్తీ చేయాలని కోరుతుండటంపై విస్మయం వ్యక్తం చేసింది. ఇలా సంబంధం లేని విషయాలను అడగడం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడమే అవుతుందని, ఏం సాధిద్దామని సంబంధం లేని విషయాలను అడుగుతున్నారని
కోర్టు ప్రశ్నించింది.

ఈ వివరాలను అసలు ఎందుకు కోరుతున్నారని ప్రభుత్వ న్యాయవాదిని నిలదీసింది. న్యాయవాది ఎవరో చెప్పాలని బలవంతం చేయడం న్యాయవాద చట్ట నిబంధనలకు విరుద్ధమని పోలీసులకు గుర్తు చేసింది. న్యాయవాదులనో, న్యాయాధికారులనో సంప్రదించి నమూనా పత్రాలను సిద్ధంచేసి ఉంటే, ఇటువంటి ప్రశ్నలకు తావు ఉండేది కాదంది. ఇలా బలవంతంగా వివరాలు కోరుతుండటంపై పోలీసుల నుంచి వివరణ తీసుకుని, తమకు తెలియజే యాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకటశేషసాయి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సకల నేరస్తుల సర్వే పేరుతో మారేడ్‌పల్లి ఎస్‌హెచ్‌వో, నార్త్‌ జోన్‌ డీసీపీలు తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ మాజీ కార్పొరేటర్, హైదరాబాద్‌ టీడీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు చిర్రబోన బద్రీనాథ్‌ యాదవ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్‌ శేషసాయి విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వి.రఘునాథ్‌ వాదనలు వినిపిస్తూ, గత నెల 19న పిటిషనర్‌ను పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు తీసుకెళ్లి, ఫొటోలు, వేలిముద్రలు తీసుకున్నారని తెలిపారు. పిటిషనర్‌పై ప్రస్తుతం రౌడీషీట్‌ కూడా లేదన్నారు.

పోలీసులు ఇస్తున్న నమూనా పత్రంలో న్యాయవాది ఎవరో, తాకట్టుపై అప్పు ఇచ్చే వ్యక్తి ఎవరో, ఉంపుడుగత్తె ఎవరో కూడా చెప్పాలని ఉందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు. పిటిషనర్‌ను వివరాల కోసం బలవంతం చేసిన పోలీసుల నుంచి వివరణ తీసుకుని తమకు తెలియచేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేశారు.