ఆందోళన బాటలో ఆంధ్రా

Posted on : 09/02/2018 08:43:00 am

అమరావతి:  విభజన హామీలను నెరవేర్చాలంటూ పార్లమెంటులో ఎంపీలు చేస్తోన్న ఆందోళనకు మద్దతుగా శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ఉద్యోగులు ఆందోళనకు పిలుపు నిచ్చారు.

ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఈ ఆందోళన చేపడుతున్నట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. విభజన హామీలను అమలు చేయాలని తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు, ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంపీలు గత మూడు రోజులుగా పార్లమెంటు లోపల, బయటా ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే... వీరి ఆందోళనకు మద్దతుగా సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా సచివాలయం ఉద్యోగులు తీసుకున్న నిర్ణయంతో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు కూడా వివిధ రూపాల్లో ఆందోళనలు చేయనున్నట్లు సమాచారం. సచివాలయ ఉద్యోగులతో ప్రారంభమైన ఆందోళన అన్ని శాఖలకూ విస్తరించే సూచనలు కనబడుతున్నాయా అంటే? అవుననే సమాధానం చెప్తున్నాయి రాష్ట్రంలో పరిస్థితులు.