కుర్రకుంక మాటలకేం గానీ మేం గెలవడం పక్కా

Posted on : 09/02/2018 12:23:00 pm

ఇవేం లెక్కల్రా నాయనా? గెలుపుపై విశ్వాసం ఉండొచ్చు తప్పులేదు, గెలుపుపై ధీమా ఉండొచ్చు అస్సలు తప్పులేదు. అయినా అబద్ధమాడితే గోడకట్టినట్లుండాలంటారు,

కనీసం దడి కట్టినట్లైనా ఉండాలన్నది సామెత అందరికీ తెలిసిందే! అన్ని తెలిసిన కాంగ్రెస్ పెద్దలకు ఈ చిన్న విషయం తెలియదా? పదేపదే కేటీఆర్ తో మాటపడడానికి కాకపోతే. కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ ఒకటంటే, షబ్బీర్ అలీ మరొకటంటారు, ఈ గోలంతా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించబోయే సీట్ల కోసమే. ఉత్తమ్ లెక్క70అయితే షబ్బీర్ అలీ పక్కా 100గ్యారెంటీ అంటూ బీరాలు పలుకుతున్నారు.

మరో వైపు కేటీఆర్ మాత్రం వచ్చే ఎన్నికల్లో గద్దెనెక్కేది తామేనని బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు, లెక్క తప్పితే రాజకీయ సన్యాసానికి సై అంటూ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో మొదటి నుంచీ కేటీఆర్ ఒకే మాటకు కట్టుబడి ఉంటే కాంగ్రెస్ మాత్రం రోజుకొక మాటతో వివాదాస్పదమవుతోంది. ఈ విషయంలో కేటీఆర్ కూడా ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు, ధీటుగానే సమాధానం ఇస్తున్నారు. కేటీఆర్ మాటలపై షబ్బీర్ అలీ కూడా మండిపడుతున్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలే కానీ.. అసభ్య పదజాలంతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం మంచిది కాదన్నారు. కేటీఆర్ మాటల్లో తప్పులు వెతికే షబ్బీర్.. తాను విసిరిన సవాల్ విషయంలో మరోసారి ఆలోచించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. షబ్బీర్ తాజా సవాలు చూస్తే.. రాజకీయాల నుంచి రిటైర్ కావాలన్నట్లుగా ఆయన వ్యాఖ్య ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఉత్తమ్ నోటి నుంచి వచ్చిన 70 సీట్ల ముచ్చటే.. ఎలా సాధ్యమని కిందా మీదా పడుతుంటే.. ఇది సరిపోదన్నట్లుగా షబ్బీర్ తాజాగా సీట్ల సంఖ్యను 100కు పెంచటం గమనార్హం.

సీట్ల సంఖ్యతో పాటు.. దిమ్మ తిరిగేలా భారీ సవాలు విసిరిన వైనం చూస్తే.. షబ్బీర్ కు ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కు వందకు పైగా సీట్లు ఎలా సాధ్యమో చెప్పాలని సవాలు విసురుతున్న వారికి షబ్బీర్ ఎలాంటి బదులు ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏమైనా షబ్బీర్ తాజా సవాలు మాత్రం ఆయన్ను రాజకీయ సన్యాసం దిశగా నడిపిస్తున్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరో పదేళ్ల వరకూ తెలంగాణ లో టీఆరెస్ కు తిరుగులేదన్న అభిప్రాయాలు స్థానికంగా చక్కర్లు కొడుతుంటే, కాంగ్రెస్ మాత్రం అవన్నీ ఉత్తుత్తి ఊహాగానాలే, కుర్రకుంక మాటలకేం గానీ, మాలెక్కలు మాకున్నాయి మేం గెలవడం మాత్రం పక్కా అని ఢంకా పదంగా చెప్తోంది.