భగ్గుమన్న పొరుగు రాష్ట్రం

Posted on : 09/02/2018 04:36:00 pm

సంబల్‌పూర్: పొరుగు రాష్ట్ర మైన ఒరిస్సాలోని సంబల్ పూర్ అట్టుడుకి పోయింది. దీనికి కారణం దొంగతనం కేసులో అరెస్టయిన వ్యక్తి పోలీస్ కస్టడీలో లాకప్ డెత్ కావడమే . దీంతో స్థానికుల ఆవేశం తారాస్థాయికి చేరడంతో రెచ్చిపోయి మరీ "అయినతపలి"పోలీస్ స్టేషన్ని ధ్వంసం చేసి నిప్పంటించారు.

గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. ఈఘటనలో లక్షలాది రూపాయల ఆస్తినష్టం జరిగిందని అంచనా. స్థానికులు రోడ్డును దిగ్బంధం చేయడంతో అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడకు చేరుకోలేకపోయారు. దీంతో పోలీస్ స్టేషన్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న వాహనాలను కూడా నిప్పుపెట్టారు. పలువురు ఆందోళనకారులు రాళ్లు రువ్వడం పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళన కారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సంబల్‌పూర్ ఎస్పీ సంజీవ్ అరోరా సహా పోలీసు సీనియర్ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించి... 7 ప్లటూన్ల పోలీసు దళాలను మోహరింపజేసినట్లం పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో సుమారు 30మంది గాయపడినట్లు సమాచారం.

భలుపలి గ్రామానికి చెందిన అవినాష్ ముండా అనే వ్యక్తిని దొంగతనం కేసులో గత బుధవారంనాడు పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. గురువారం అతని లాక‌ప్‌లో ఉరి వేసుకుని కనిపించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులే తమ కొడుకును కొట్టి చంపారని, అతని దేహంపై తీవ్రమైన గాయాలున్నాయని అవినాష్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. కాగా ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామని. 150 నుంచి 200 మంది పోలీసు స్టేషన్‌ వద్ద ఘెరావ్ చేసి స్టేషన్‌కు నిప్పుపెట్టారని ఎస్పీ సంజయ్ అరోరా తెలిపారు.