తేదేపా ఊ అంటే ఎన్డీయే పాతాళానికే

Posted on : 09/02/2018 05:46:00 pm

మాయల ఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్లు మోదీ పిలక ఏమైనా చంద్రబాబు చేతిలో ఉందా? అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం అవుననే అంటున్నారు. ఎన్డీయే కూటమిలో ఉన్న ఏ పార్టీ తోనూ కీలకనిర్ణయాలు తీసుకునే టైం లో కనీసం సంప్రదింపులు జరపడం మాట అటుంచితే కనీసం తెలియపరచడం లాంటివి లేదన్నది ఎప్పటినుంచో చెప్పుకుంటున్న విషయమే. నియంతృత్వ దోరణిలో వ్యవహరించే బీజేపీ పెద్దల తీరుకి కూటమి సభ్యులు నొచ్చుకోకుండా ఉండరనేది అక్షర సత్యం. ఎన్డీయే కూటమిలో ఉన్న శివసేన ,తేదేపా, ఎడిఎంకె, కీలక పార్టీలైతే నోట్ల రద్దు, జిఎస్టీ, ఇలా బీజేపీ సొంత నిర్ణయాలే తప్ప మిగతా మిత్రపక్షాల ప్రమేయం ఏమాత్రం లేదనే వాదనా ఉంది.అనేక సందర్భాలలో చూసీచూడనట్లు వదిలేసిన శివసేన కూడా కీలక నిర్ణయమే తీసుకుంది. హిట్లర్ పాలనకేమాత్రం తీసిపోని మోదీతో ముందుకెళ్లడం దాదాపు అసాధ్యం అనుకుందో ఏమో, మహారాష్ట్రలో స్వతంత్రంగా పోటీ చేస్తామని శివసేన ఇదివరకే ప్రకటించింది. ఎన్డీయే లో ఉన్న మరో కీలక పార్టీ తేదేపాతో ప్రస్తుత పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. పొత్తు విషయంలో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. తేదేపా ఎంపీలకైతే మోదీ సర్కార్ తో ముందుకెళ్లడం అనేది ఏమాత్రం ఇష్టం లేదన్నది బహిరంగంగానే తెలిసి పోయింది.

ఇటీవల రాజస్థాన్ లో రెండు లోక్ సభకు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తన సిట్టింగ్ స్థానాలను కూడా కోల్పోయింది. గడచిన ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీగా 295 స్థానాలను దక్కించుకున్న బీజేపీ ఈ రెండు స్థానాలను కోల్పోయిన నేపథ్యంలో ఆ పార్టీ సంఖ్యాబలం లోక్ సభలో 293కు పడిపోయింది. అయితే ఈ సంఖ్యతోనే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సంబంధం లేకుండానే ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చే అవకాశాలున్నా, పార్టీలో రెబెల్స్ గా మారిన వారి ప్రభావంతో సీట్ల సంఖ్య మరింతగా తగ్గిపోయే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ రాజకీయవేత్త - మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ టీవీ చానెల్ నిర్వహించిన లైవ్ డీబేట్ లో పాల్గొన్న సందర్భంగా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. రెబెల్స్ తొ పాటుగా శివసేన మాదిరే టీడీపీ కూడా మోదీ సర్కారుకు మద్దతు ఉపసంహరిస్తే... ఇప్పటికిప్పుడు ఎన్డీఏ సర్కారు కూలడం ఖాయమని ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఉండవల్లి చెప్తున్న గణాంకాల ప్రకారం ఇప్పటికీ మోదీ సర్కారుకు లోక్ సభలో మెజారిటీ ఉన్నా శివసేన మాదిరిగా ఏపీకి న్యాయం కోసం పోరాడుతున్న టీడీపీ కూడా బీజేపీకి మద్దతు ఉపసంహరిస్తే... బీజేపీ టికెట్ల మీద గెలిచిన చాలా మంది ఎంపీలు తమ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీకి వీడ్కోలు పలకడం ఖాయమేనన్న ఊహాగానాలు వినబడుతున్నాయి. మొత్తంగా ఉండవల్లి అంచనా ప్రకారం, ఏపీకి కేంద్రంలోని మోదీ సర్కారు అన్యాయం చేసిందని పార్లమెంటు వేదికగా ఉద్యమానికి తెర తీసిన టీడీపీ ఇప్పటికిప్పుడు ఎన్టీఏ సర్కారు నుంచి బయటకు వస్తే ‌ఎన్డీయే కూలిపోతుందని ఉండవల్లి చెప్తున్నా కూడా ఎవరిలొసుగులు వారికుంటాయిగా లేకుంటే ఓటుకు నోటు విషయంలో చంద్రబాబు బయట పడేవారా? కేంద్రం కొమ్ముకాయకుంటే అనే సూటిపోటి మాటలు వినబడుతున్నాయి. ఒక వేళ శివసేన లాగా ,చంద్రబాబు కూడా ఎన్డీయే నుంచి బయటకు రావాలని ఖచ్చితంగా నిర్ణయించుకుంటే మాత్రం ఎన్డీయే పుట్టి మునగడం దాదాపు ఖాయమైనట్లే.