ఒప్పుకున్నట్టా? తప్పుకున్నట్టా?

Posted on : 10/02/2018 08:20:00 am

న్యూఢిల్లీ: విభజన హామీలపై రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు తీవ్ర ఆందోళనలు, వెళ్లువెత్తుతున్న నేపథ్యంలో పార్లమెంటు బయట,లోపల అధికార ప్రతిపక్షాలు నిరసన బాటపట్టి కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. దీంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులను మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఓ వైపు ఈ అంశాన్ని అధికార తేదేపా తమ క్రెడిట్ గా చెప్పు కుంటుంటే, ప్రతిపక్ష వైసీపీ ఇదంతా మోసపూరితమే తప్ప ఇందులో నిజాలేం లేవని కొట్టి పారేసింది నాలుగేళ్లుగా పట్టని రాష్ట్రాభివృద్ధి నాలుగు రోజుల పోరాటానికే కేంద్రం దిగొచ్చిందా అనే ప్రశ్నలను వైసీపీ సందిస్తోంది. ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో శుక్రవారం చేసిన ప్రకటనలో రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క హామీపైనా స్పష్టత ఇవ్వలేదని, అలాంటిది టీడీపీ ఎంపీలు ప్రైవేటు భేటీలో కేంద్రాన్ని ఒప్పించడం, అది కూడా ప్రధాని విదేశీ పర్యటనకు వెళ్లాక వచ్చిన లీకులు ఇదొక బూటకం మాత్రమేనని కొట్టి పారేస్తుంది. ఇదిలా ఉంటే అసలేం జరిగింది?‌ కేంద్రంతో తేదేపా జరిపిన మంతనాలేంటి? కేంద్రం ఎలాంటి హామీలిచ్చింది అనే వివరాలిలావున్నాయి.
 
శుక్రవారం సాయంత్రం కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, పియూష్ గోయల్‌‌, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో అత్యవసరంగా భేటీ అయిన సుజనా చౌదరి ఏపీకి రావాల్సిన నిధుల విషయమై ఆఖరి సారిగా అడిగి తేల్చేశారు. సుజనా ముమ్మర ప్రయత్నాలు, సుదీర్ఘ చర్చలు ఫలించాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్టకేలకు సుజనా ఒప్పించారు. శుక్రవారం రాత్రి రెండున్నరగంటల పాటు పార్లమెంట్ వేదికగా చర్చలు ఉత్కంఠగా కొనసాగాయి. ఏపీకి ఇవ్వాల్సిన నిధులు, సంస్థలు, రైల్వేజోన్‌ ప్రకటన, దుగరాజపట్నం పోర్టు లాంటి అంశాలపై కీలక చర్చలు జరిగాయి.
 
స్పందించిన కేంద్రం
పార్లమెంట్‌ నిబంధనల ప్రకారం పలు మంత్రిత్వశాఖల అంశాల ప్రస్తావన చేయకూడదని జైట్లీ స్పష్టం చేశారు. అయితే రెండో దశ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం లోపు అన్ని ప్రకటనలు పూర్తిచేసి కార్యాచరణకు వెళ్లాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఏపీ రెవెన్యూలోటు భర్తీకి సమావేశంలో అంగీకారం లభించింది. 14వ ఆర్థికసంఘం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన మొత్తం నిధులు ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మూడేళ్ల నుంచి రావాల్సిన నిధులు త్వరలో ఏపీకి అందనున్నాయి. మిగిలిన మొత్తాన్ని ప్రతి యేటా విడుదల చేయాలని కేంద్రం అంగీకరించింది.

హోదా వల్లే వచ్చే నిధుల మొత్తాన్ని ఒకేసారి ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మంత్రులు సుజనాకు వివరించారు. ఈఏపీ నిధులు కూడా సర్దుబాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి ఇస్రో అభ్యంతరం తెలిపడంతో.. మరోచోట పోర్టు నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చింది. పెట్రో కెమికల్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు 12 శాతం నుంచి సాధ్యమైనంత ఐఆర్‌ తగ్గించుకోవాలని చమురు సంస్థలకు ఆదేశాలు జారీచేయనున్నట్లు కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. ఇదిలా ఉంటే ఇంట‌ర్ ఆఫీస్ మెమోను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని నిర్ణయం తీసుకుంది.
 
త్వరలో ఏపీపై కేంద్రం కురిపించనున్న వరాల జల్లు:
ప్రభుత్వ‌, ప్రైవేటు భాగ‌స్వామ్యంతో క‌డ‌ప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 12 నాటికి మెకాన్‌ సంస్థ నివేదిక సిద్ధం చేయనుంది. ఇవన్నీ అటుంచితే త్వరలో రైల్వేజోన్‌ ఏర్పాటు ప్రకటన చేయనున్నట్లు కేంద్రం సంచలన ప్రకటన చేసింది. అయితే ఇది విశాఖ రైల్వే జోనా లేకుంటే మరొకటా అనే విషయం మాత్రం కేంద్రం ఎలాంటి స్పష్టతనివ్వలేదు. అమ‌రావ‌తి నిర్మాణానికి చేసిన ఖ‌ర్చు వివ‌రాలు పంపితే నిధులు విడుద‌ల చేయాల‌ని కేంద్రం నిర్ణయించింది. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల ఇబ్బంది లేకుండా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని... పోలవరంను అనుకున్న సమయానికి పూర్తిచేయాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ రాష్ట్రానికి కొండంత నిధులిచ్చామని ఇవ్వాల్సింది గోరంతేనని చెప్పుకొచ్చిన కేంద్రం కనీసం ఈ మాటమీదైనా నిలబడుతోందా? అనే కొత్త ప్రశ్న జనాల్లో రేకెత్తుతోంది. పోలవరానికి ఇచ్చిన నిధులతో పాటు, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం విడుదల చేసిన నిధులకు కేంద్రం లెక్కలడగడం, చంద్రబాబు దాటవేయడం తెలిసిన సంగతే. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నిజంగానే దిగొచ్చిందా కొంత కాలం టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఇచ్చిన ట్విస్టేనా అనేది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.