నరబలి కేసులో వీడిన సస్పెన్స్

Posted on : 10/02/2018 09:45:00 am

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మూడునెలల పసికందు నరబలి కేసులో హైదరాబాద్ పోలీసులు మరో ముందడగు వేశారు. ఆ పసికందుకు సంబంధించిన కేసులో తల మొండెం వేరు కావడం, తల మాత్రమే దొరకడం, హత్యకు గురైన శిశువు ఆడా? మగ అన్నది తేలలేదు అయితే ఫ్లోరెన్సిక్ నివేదిక ఆధారంగా మృతిచెందింది ఆడ శిశువేనని పోలీసులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే ఈ కేసులో అనుమానితుడుగా ఉన్న క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదు. దీంతో పోలీసులు సాంకేతిక ఆధారాలపై దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం సిటీకి చెందిన ప్రత్యేక క్లూస్‌ టీమ్‌ను చిలుకానగర్‌కు రప్పించారు. ప్రధాన అనుమానితుడు రాజశేఖర్‌ ఇంటితో పాటు చుట్టుపక్కల మరికొన్ని ఇళ్లల్లోనూ తనిఖీలు చేశారు. రాజశేఖర్‌ ఇంటికి సంబంధించి అతడు నివసించే డాబాతో పాటు పక్కనే ఓ రేకుల షెడ్డు కూడా ఉంది. దీనిపై అనుమానాస్పద స్థితిలో ఉన్న వెదురు చీపురును అధికారులు గుర్తించారు. దీంతో పాటు లభించిన కొన్ని వస్తువుల్ని అనుమానిత వస్తువుల జాబితాలోకి చేర్చారు. ఇలాంటి వాటిని సాధారణంగా క్షుద్రపూజల కోసం వినియోగిస్తారని అనుమానిస్తున్న అధికారులు.. నిర్థారణ కోసం అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు. రాజశేఖర్‌ ఇంటి బెడ్‌రూమ్‌లో కొన్ని అనుమానిత మరకల్నీ ఫోరెన్సిక్‌ నిపుణులు గుర్తించారు. ఇవేంటనేవి గుర్తించేందుకు పరీక్షలకు పంపారు. శనివారం ఆ నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఉప్పల్‌ పోలీసులు ఇప్పటి వరకు దాదాపు 71 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు.

మరోపక్క హత్యకు గురైన పసిపాప ఎవరనేది ఇప్పటికీ స్పష్టత రాలేదు. కరీంనగర్‌ జిల్లా తండాల నుంచి తీసుకువచ్చిన శిశువుగా వార్తలు రావడంతో ప్రత్యేక పోలీసు బృందాలు ఆ జిల్లాలో ఆరా తీశాయి. తండాల్లో విచారించినప్పటికీ ఎలాంటి సమాచారం రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో నమోదైన మిస్సింగ్‌ కేసుల వివరాలపై కూపీ లాగుతున్నారు. గతేడాది నవంబర్‌ నెలలో పాతబస్తీలోని ఓ ప్రాంతం నుంచి శిశువు అదృశ్యమైనట్లు ఉప్పల్‌ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఆ శిశువుకు తల్లిదండ్రుల నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్లు తెలిసింది. ఈ నమానాలకు రాజశేఖర్‌ ఇంటిపై లభించిన తల నుంచి సేకరించిన నమూనాలతో పోలుస్తూ డీఎన్‌ఏ పరీక్షలు చేయనున్నారని సమాచారం. మిస్టరీగా మారి, పోలీసులకు సవాల్‌ విసురుతున్న ఈ కేసుపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో జరుగుతున్న వరుస హత్యలతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. హైటెక్ సిటీ కాస్తా హత్యల సిటీగా మారుతున్న క్రమం పోలీసుకు పెను సవాల్ గా మారుతోంది.