కవితను అలా అన్నాడు ఇది దేనికి దారితీస్తుందో?

Posted on : 10/02/2018 10:39:00 am

హైదరాబాద్: రాజకీయాలంటేనే ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం, తరవాత ఇట్టే కలిసి పోవడం సాధారణ విషయమే. ఆ విషయాన్ని జనసేన అధినేత పవన్ బాగానే ఒంటపట్టించుకున్నట్టున్నాడు. గతెన్నికల్లో అటు బీజేపీకి, ఇటు తేదేపాకు అత్యంత సన్నిహితంగా మెలిగిన పవన్ ఈ మధ్య బాహాటంగానే తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాడు. అయితే తెలంగాణ టీఆరెస్ తో బాగానే సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు.

ఒకప్పుడు కేసీఆర్‌పై, ఆయన కూతురు కవితపై తీవ్ర విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నారు. కేసీఆర్ పాలనపై ప్రశంసల జల్లు కురిపించిన పవన్ ఇప్పుడు ఎంపీ కవితను చెల్లెలు అంటూ సంబోధించారు. ‘పార్లమెంట్‌లో ఏపీ ప్రజలకు మద్దతుగా మాట్లాడిన చెల్లెలు కవిత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని పవన్ ట్వీట్ చేయడం విశేషం.
 
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను, చేసిన ప్రమాణాలను నిలబెట్టుకోవాలని ఎంపీ కవిత పార్లమెంట్‌లో ప్రస్తావించడాన్ని పవన్ అభినందించారు. ఎంపీ కవితపై జనసేన పార్టీ ప్రకటించిన రోజున పవన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం కవితను అభినందించడాన్ని ఎవరూ తప్పుబట్టడం లేదు కానీ పవన్ టీఆర్‌ఎస్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలను మాత్రం మరొక్క సారి అందరూ గుర్తుచేసుకుంటున్నారు.
 
అప్పట్లో జనసేన పార్టీ ప్రకటించే ముందు తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన కవిత వ్యాఖ్యలకు సభా వేదిక సాక్షిగా పవన్ కౌంటర్ ఇచ్చారు. ‘అమ్మా కవిత.. తల్లి... నువ్వు నాకు చెల్లెలు లాంటి దానివి... నేను నీ బాధను, వేదనను అర్థం చేసుకున్నానమ్మా.. ఒక అన్నయ్యగా నీ బాధను అర్థం చేసుకున్నాను’ అని పవన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. క్షమాపణ చెప్పాలా వద్దా అనేది నన్ను ప్రేమించే తెలంగాణ అభిమానులకు, నాకు సంబంధించిన వ్యక్తిగత విషయం, నన్ను క్షమాపణ చెప్పమని అడగటానికి మీరెవరు’ అంటూ పవన్ ప్రశ్నించారు. తెలంగాణాలో సైతం తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించ తలపెట్టిన జన సేన అధినేతకు ఇదొక పాజిటివ్ అంశమేనని జనసేన గురించి జనం అనుకుంటున్నారు.