రైతే రాజు రాజకీయాలొద్దు

Posted on : 10/02/2018 11:23:00 am

ఒకరు ప్రవేశ పెట్టిన పథకాలు ప్రభుత్వం మారగానే పేరుతో పాటు దానిపై ఉన్న ఫోటో కూడా మారిపోవడం సర్వసాధారణం. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు కూడా మరీ ముఖ్యంగా తెలుగురాష్ట్రాల్లో అయితే ఇలాంటి వాటికి లెక్కేలేదు. అందుకు పూర్తి భిన్నంగా తెలంగాణాలో చోటుచేసుకుంది. రైతులకు కొత్తగా ఇవ్వనున్న ఎలక్ట్రానిక్ టైటిల్ డీడ్ కమ్ పట్టాదార్ పాస్ పుస్తకంపై తన ఫోటోను ప్రింట్ చేయొద్దని తేల్చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులకు ఇచ్చే పాస్ పుస్తకం మీద కేసీఆర్ ఫోటో వేసేందుకు ప్రయత్నాలు జరగడంతో తన దృష్టికి వచ్చిన ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులకు సంబంధించిన పాస్ పుస్తకంపై రైతు ముఖచిత్రాన్ని మాత్రమే ముద్రించాలని కేసీఆర్ తేల్చి చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 72 లక్షల పాస్ పుస్తకాల్ని ప్రింట్ చేయించనున్నారు. ఈ ప్రింటింగ్ బాధ్యతలు జాతీయ సెక్యురిటీ ప్రింటింగ్ ప్రెస్ కు అప్పగిస్తున్న ఫైలుపై సంతకం చేసిన కేసీఆర్.. పాస్ బుక్ పై రైతు ఫోటో.. తెలంగాణ ప్రభుత్వ ముద్ర మాత్రమే ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

పాస్ బుక్ పై తన ఫోటో ఉన్న పక్షంలో రాజకీయ కోణంలో విమర్శలు వెల్లువెత్తుతాయని.. పాస్ బుక్ అన్నది ఎవరికి వారికి సొంత వ్యవహారమని.. అందుకే ఫోటో వద్దని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. రైతులకు పంపిణీ కార్యక్రమాన్ని వచ్చే నెల 11న స్టార్ట్ చేద్దామని సీఎం కేసీఆర్ డిసైడ్ చేశారు. రైతులకు మేలు జరిగే పనిలో రాజకీయాలు ఉండకూడదన్న సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రైతే రాజు రాజకీయాలొద్దు అనే నినాదానికి సీఎం కేసీఆర్ పెద్ద పీఠ వేశారని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.