జమ్మూలో హై అలర్ట్ ఉగ్ర పంజాకు ఒకరు బలి

Posted on : 10/02/2018 11:57:00 am

జమ్మూ కశ్మీర్‌లో సైనిక స్థావరం పై జైషే మహ్మద్ ఉగ్రవాదులు శనివారం ఉదయం దాడి చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆర్మీ అధికారి కుమార్తె హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనలో మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. తెల్లవారుజామున 4.55 గంటల ప్రాంతంలో 36 ఆర్మీ బ్రిగేడ్ క్యాంపుపై ఉగ్రవాదులు బాంబులతో దాడిచేసి, కాల్పులకు తెగబడ్డారు. జేసీఓ క్వార్టర్స్ సమీపంలోని సంత్రి బంకర్ వద్ద అనుమానాస్పద కదలికలను గుర్తించిన సైన్యం వెంటనే అప్రమత్తమై ఉగ్రవాదులపై కాల్పులు జరిపిందని జమ్మూ ఐజీపీ ఎస్డీ సింగ్ జమ్వాల్ తెలిపారు. తీవ్రవాదుల దాడిలో గాయపడిన జవాన్లను వైద్యం కోసం మిలటరీ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదుల పాల్గొన్నట్లు ఐజీ తెలియజేశారు. మరోవైపు సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల పాఠశాలలను మూసివేశారు. ఘటనాస్థలికి 500 మీటర్లలోపు పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఉగ్రవాదులతో పోరాటానికి అదనపు బలగాలను రప్పించారు. సుంజ్వాన్ చేరుకున్న ఆర్మీ ప్రత్యేక దళాలు, ఎస్ఓసీ సైన్యం ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు ముమ్మరం చేశాయి. ఉగ్రదాడిపై కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ జమ్మూ కశ్మీర్ డీజీపీతో మాట్లాడి, హోమ్ శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటుపై దాడికేసులో కీలక సూత్రధారి అఫ్జల్ గురును 2013 ఫిబ్రవరి 9 న ఉరితీసిన సంగతి తెలిసిందే. అఫ్జల్ వర్దంతి సందర్భంగా జైషే మహ్మద్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు సైతం హెచ్చరించాయి. ఉగ్రదాడితో జమ్మూ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు.

వారం రోజుల వ్యవధిలో ఉగ్రవాదులు రెండోసారి దాడికి తెగబడ్డారు. పుల్వామా జిల్లా, బాట్ గండ్ లో సీ ఆర్పీఎఫ్ క్యాంపు పై గ్రనేడ్ లతో దాడి చేసి ముగ్గురు జవాన్ల మృతికి కారణమైన ఘటన మరవక ముందే ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని ఆర్మీ అధికారులు వెల్లడించారు.య్క