ఎక్కడ తగ్గలో కేటీఆర్ కి బాగా తెలుసు

Posted on : 10/02/2018 06:17:00 pm

స్పందించాలన్నా, ఎదిరించాలన్నా, ఎదిగినా, ఒదిగినా ఆయనకు ఆయనే సాటి. మాట తీరే కాదు వ్యవహారశైలిలోనూ ఆయనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్న నేత తెలంగాణా ఐటీ మంత్రి కేటీఆర్. కేటాయింపుల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిన నేపథ్యంలో ఆంధ్రాకే ఎక్కువ అన్యాయం జరిగిందని‌ ఇచ్చిన హామీలను ఎందుకు నిలబెట్టుకోలేదని కేంద్రాన్ని ప్రశ్నించి ఆంధ్రానుంచి సైతం అభిమానులను సంపాదించుకున్నారు‌. ఎదురు దాడికి దిగితే పక్కా సబ్జెక్టుతో మాట్లాడే కేటీఆర్ ఎదురుపడిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుతో చేతులు కట్టుకొని
ఎంతో ఒబిడియంట్ గా మాట్లాడిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
   
పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజును కలిసిన కేటీఆర్ ఆయన ముందు చేతులు కట్టుకుని ఆయన చెప్పే మాటలను శ్రద్ధగా వినడం అందరినీ ఆకట్టుకుంటోంది. పౌర విమానయానశాఖ ఆధ్వర్యంలో మార్చి 8 నుంచి 11వ తేదీ మధ్య హైదరాబాదులో "వింగ్స్ ఇండియా 2018" పేరిట అంతర్జాతీయ సదస్సు - ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ అశోక్ ను కలిశారు. ఈ సందర్భంగా వారిద్ధరి మధ్య సంభాషణల సమయంలో అశొక్ చెప్పే మాటలను కేటీఆర్ శ్రద్ధగా - బుద్ధిగా ఒక విద్యార్థికి మళ్లే చేతులు కట్టుకుని మరీ విన్నారు.
   
కేటీఆర్... అశోక్ కు అంతగా గౌరవం ఇవ్వడానికి కారణాలున్నాయి. విజయనగర రాజ వంశీకుడైన అశోక్ ప్రస్తుత తరానికి చెందిన క్లీన్ లీడర్లలో ఒకరు. పుట్టుకనుంచే, ఉన్న స్థాయితో కానీ ప్రస్తుతం పదవుల పరంగా ఉన్న అధికారంతో కానీ సంబంధం లేకుండా అత్యంత సామాన్యంగా ఒక సాధారణ వ్యక్తిలా జీవించే ఆయన పద్ధతి కూడా ఎవరైనా ఆయన్ను గౌరవించేలా చేస్తుంది. వీటితో పాటు రాజకీయంగా చూసుకున్నా కేటీఆర్.. అశోక్ పట్ల కృతజ్ఞత చూపాల్సిన పరిస్థితులున్నాయి.

హైదరాబాద్ అభివృద్ధి విషయంలో నిత్యం చంద్రబాబును టీఆరెస్ నేతలు విమర్శిస్తుంటారు. ఇలాంటి తరుణంలో అశోక్ కనుక అనుకుంటే ఈ ప్రతిష్ఠాత్మక సదస్సును హైదరాబాదులో కాకుండా ఇంకెక్కడైనా నిర్వహించొచ్చు. కానీ హైదరాబాద్ ప్రాధాన్యం దృష్ట్యా అశోక్ ఈ సదస్సుకు ఆ నగరాన్నే ఎంచుకున్నారు. అందుకే... ‘వింగ్స్ ఇండియా 2018' సదస్సు కోసం విమానయాన శాఖ హైదరాబాదును వేదికగా చేసుకున్నందుకు అశోక్ గజపతికి కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు. వ్యక్తిత్వంపరంగా - రాజకీయంగా కూడా ఉన్నతుడు కావడంతో కేటీఆర్ అశోక్ ముందు వినయం ప్రదర్శించి తన గొప్పతనాన్నీ చాటుకున్నారు. ప్రతిపక్షం కూడా విమర్శించడానికి అవకాశం ఇవ్వని మనిషంటూ ఉంటే అది నేటి రాజకీయాల్లో కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు మాత్రమేనన్న సంగతి దాదాపు అందరూ అంగీకరించాల్సిన విషయమే అలాంటి వ్యక్తి దగ్గర కేటీఆర్ వినయంగా ప్రవర్తించడం పలువుర్ని ఆకర్షించింది.