మోదీ లెక్క తేలుస్తా

Posted on : 11/02/2018 08:37:00 am

అమరావతి:  కేంద్రంతో తేదేపా టగ్ ఆఫ్ వార్ కి సిద్ధమవుతోన్నట్లే కనిపిస్తోంది. ఇంతకాలం రాష్ర్టానికి చాలా చేశామని కేంద్రం, అసలేం చేసిందో చెప్పకుండా రాష్ట్రం ప్రభుత్వం ఒకదానిపై ఒకటి డొంక తిరుగుడు సమాధానాలతో నెట్టుకొస్తూనే ఉన్నాయి తప్ప ఇప్పటి వరకూ దీనిపై ప్రజలకు ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. ఇటు కేంద్ర ప్రభుత్వం చూస్తే బడ్జెట్ పరిణామాలనంతరం బహిరంగంగానే చెప్పుకొస్తోంది ఆంధ్రాకు ఎంతో చేశామని. అయితే చంద్రబాబు కూడా ఈ విషయంలో పెదవి విప్పలేదు. దీనిపై ప్రతిపక్ష పార్టీలే కాదు, ఇటు జన సేన కూడా తేదేపా పై విమర్శనాస్త్రాలు సందిస్తోంది. కేంద్రం ఇప్పటి వరకూ ఇచ్చిన లెక్కలు తేల్చమంటూ. తేదేపాకు కచ్చితంగా లెక్క చెప్పాల్సిన అవసరం ఏర్పడింది లేకుంటే కచ్చితంగా రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే అన్ని రాష్ట్రాలతో సమానంగా ఇవ్వాల్సిన నిధులను సైతం విభజన హామిలో లెక్కల కింద జమకట్టడం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న మోదీ ప్రభుత్వ బండారాన్ని ప్రజల ముందుకు తెచ్చేందుకు తేదేపా తీవ్ర కసరత్తులు చేస్తోంది.

బీజేపీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో గణాంకాల మాయాజాలం తప్ప వాస్తవాలు కనిపించడం లేదని, అన్ని రాష్ట్రాలకు సాధారణంగా వచ్చే నిధులను కూడా భారీగా పెంచి చూపించి మాయ చేసే ప్రయత్నం చేశారని టీడీపీ అభిప్రాయపడుతోంది. బీజేపీ విడుదల చేసిన ప్రకటనలోని అంశాలపై సమగ్రంగా విశ్లేషణ జరిపి వాస్తవాలతో ప్రజల ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీ నేతలను ఆదేశించారు. ఎంపీలు రామ్మోహన్‌ నాయుడు, గల్లా జయదేవ్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుకు ఈ బాధ్యత అప్పగించారు. రాష్ట్రానికి చాలా చేశామని చెప్పాలన్న తాపత్రయంలో అవాస్తవాలు, వక్రీకరణలతో తమ ప్రకటనను బీజేపీ నేతలు నింపారని, వారు చెబుతున్న వాటిలో రాష్ట్రానికి నిజంగా వచ్చిన నిధులు బాగా తక్కువని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దానికి కొన్ని ఉదాహరణలు కూడా వారు వివరించారు. ‘హడ్కో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా కొన్ని నిబంధనల ప్రకారం పని చేస్తుంది. కేంద్రం ఇచ్చేయమనగానే రాష్ట్రాలకు నిధులు ఇవ్వదు. నిబంధనలు అన్నీ పరిపూర్ణంగా పాటించి తగిన అర్హతలు సాధిస్తేనే ఆ సంస్థ రుణం ఇస్తుంది. ఆ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి హడ్కో నుంచి రుణం కోసం దరఖాస్తు పెట్టుకొంది. అన్నీ చూసి రూ.7500 కోట్లు రుణం ఇవ్వడానికి ఆ సంస్థ ఒప్పుకొంది. కానీ ఇప్పటిదాకా చేతికి వచ్చింది రూ.600 - 700 కోట్లకు మించి లేదు. మిగిలినవి ఇస్తామని చెబుతున్నారు. అవి కూడా తాము ఇప్పించినట్లుగా కేంద్రం తన ఖాతాలో వేసుకొని మొత్తం ఇచ్చేసినట్లుగా చూపిస్తోంది. చూపించేది ఎక్కువ. వచ్చింది తక్కువ’ అని టీడీపీ నేతొకరు చెప్పుకొచ్చారు.

 
ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద ఇళ్ల మంజూరుకు సంబంధించిన నిధుల తీరు కూడా ఇలానే ఉందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ‘ఈ పథకం కింద రాష్ట్రానికి 6.8 లక్షల ఇళ్లు ఇచ్చారు. వాటి మొత్తం నిర్మాణ వ్యయం రూ.27 వేల కోట్లు. అందులో కేంద్రం రూ.10 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. మరో పది వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. ఇప్పటి వరకూ ఈ పద్దు కింద రాష్ట్రానికి వచ్చింది కేవలం రూ.892 కోట్లు. రాష్ట్రం చేతికి ఎంత వచ్చింది చెప్పకుండా రూ.27 వేల కోట్లు ఇచ్చామని చెప్పడం ప్రజలను పక్కదారి పట్టించడమే’ అని ఆ వర్గాలు వివరించాయి. రాష్ట్రం ఖర్చుపెట్టిన మొత్తాన్ని తిరిగి ఇచ్చి, ఆ మొత్తాన్ని కూడా కేంద్రం తన ఖాతాలో వేసుకుందని ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన దానిలో కేంద్రం రూ.4 వేల కోట్లు తిరిగి ఇచ్చిందని, దాన్ని కూడా రాష్ట్రానికి కొత్తగా ఇచ్చినట్లు చూపుతున్నారని తేదేపా వర్గాలు చెప్తున్నాయి.

రాష్ట్రం ఖర్చు చేసిన డబ్బును కేంద్రం ఇంకా కొంత తిరిగి ఇవ్వాల్సి ఉందని, దాని గురించి మాత్రం ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు. దేశంలో ప్రతి రాష్ట్రంలో దూరదర్శన్‌ కేంద్రాలు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్‌కు దూరదర్శన్‌ కేంద్రం కోసం నిధులు ఇస్తున్నామని చెప్పి అది కూడా రాష్ట్రానికి చేసిన సాయంగా చెప్పడం సరికాదని మరో నేత వ్యాఖ్యానించారు. కేంద్రీయ విద్యాసంస్ధలకు రాష్ట్రం ఇచ్చిన భూమిని కూడా కేంద్రం ఖాతాలో వేసుకున్నారని, వాటి నిర్మాణానికి బాగా తక్కువగా నిధులు ఇవ్వడంపై మాత్రం ఎక్కడా వివరణ ఇవ్వలేదని ఆయన అన్నారు. ‘మాకు భేషజాలు లేవు. ఉదారంగా నిధులు ఇస్తే ఇచ్చారనే చెబుతాం. రెగ్యులర్‌గా అందరికీ ఇచ్చిన వాటినే చూపించి రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇస్తున్నామని చెబితే మాత్రం ఒప్పుకోం. వాస్తవాలు ఏమిటో ప్రజలకు చెబుతాం’ అన్నది టీడీపీ వర్గాల మాట.
 
రాష్ట్రానికి చాలా చేశామంటూ బీజేపీ ఇచ్చిన ప్రకటనకు పక్కా లెక్కలతో సమాధానం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈమేరకు అంశాలవారీగా లెక్కలతో వర్కింగ్‌ పేపర్‌ను తయారు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు నిమగ్నమయ్యాయి. ఇంత కాలం కేంద్రాన్ని వెనకేసుకొచ్చిన చంద్రబాబు తన మెడమీద కత్తిని గ్రహించి కేంద్రం బొక్కల్ని బయట పెట్టే పనికి శ్రీకారం చుట్టారన్న మాట. లెక్కలన్నీ ఒక కొలిక్కొస్తే గానీ తెలియదు కేంద్రం నిజంగానే బొక్క పెట్టిందా? లేదంటే చంద్రబాబు చెప్పే లెక్కల్లోనే బొక్కలున్నాయా అనే విషయం.