ఇంటెలిజెంట్ మూవీ రివ్యూ

Posted on : 11/02/2018 05:11:00 pm

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరం తేజ్ నటించిన కొత్త సినిమా ఇంటిలిజెంట్ ఈ శుక్రవారం తెరమీదికి వచ్చింది.మాస్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

ఈ విశ్లేషణలో కథను గానీ కథనాన్ని గానీ పూర్తిగా వివరించే పని చేయబోవడం లేదు.సినిమాపై ఎంతో కొంత ఆసక్తి ఉన్నవాళ్ళకు ఆ కాసింత ఆసక్తి కూడా పోకూడదు అని.

కథ:

కథలోకి వెళితే ఒక అనాధ కుర్రాడిని చేరదీసి చదువు చెప్పించే ఒక మంచి మనిషి.ఆయన సాఫ్ట్ వేర్ కంపెనీని అక్రమంగా లాక్కోవాలని చూసే విలన్ బ్యాచ్.ఈ క్రమంలో ఆ పెద్ద మనిషి మరణం ఆ కుర్రవాడి ప్రతీకారం.ఇదే మొత్తంగా ఈ సినిమా కథ.ఇంతకు మించి చెప్పుకోవడానికి కూడా ఏమి లేదు.ఇందులో కొత్తదనం భూతద్దం పట్టుకుని వెతికినా దొరకడం కష్టమే.షరా మామూలుగా ఆ కుర్రవాడే హీరో. తెలుసుగా!

విశ్లేషణ:

కథ మొదలైన కొద్ది సేపట్లోనే ఇదో రొటీన్ సినిమా అన్న అనుమానాలు మొదలవుతాయి.కథ ముందుకు కదిలేకొద్దీ అవి నిజమవుతాయి. సన్నివేశాలు దొర్లుతున్నా కథలో మనం కూడా భాగం అయ్యేలా కథనం సాగదు.సాయిధరం తేజ్ కి నాజర్ కి మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పే సన్నివేశాలు, ఆయన చావుకు ప్రతీకారం తీర్చుకునే సన్నివేశాలు ఈ చిత్రానికి ఆయువు పట్టుగా నిలవాల్సి ఉండగా అవే గుదిబండగా తయారయ్యాయి.

తను దేవుడిలా భావించే వ్యక్తిని పోగొట్టుకున్న ఒక అనాధ తీర్చుకునే ప్రతీకారంలో ఎంతో ఆవేదన ఉండాలి.వాళ్ళను చంపే విధానంలో మరెంతో ఉత్సుకత ఉండాలి.పేరుకు తన వాళ్ళను చంపినవాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునే కథే అయినా సరైన ఎమోషన్లు, ఆసక్తికర కథనం, అబ్బురపరిచే సన్నివేశాలు ఉంటే ఎన్ని ట్రెండులు వచ్చినా ఏ కాలంలో అయినా ఇది ప్రేక్షకుడిని ఆకట్టుకునే కథే.సమస్యల్లా దాన్ని తీసే విధానంతోనే .ఇక్కడా అదే తప్పు జరిగింది.

కథ రొటీన్ ఐనప్పుడు స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయాలి.ఇక్కడ అది కూడా జరగలేదు.ఎప్పుడో ఎనభైలలో కూడా తీయడానికి పనికిరాని కథా కథనాలతో ఇప్పుడు తీసే ధైర్యం ఎలా వచ్చిందో వినాయక్ ,ఆకుల శివలకే తెలియాలి.
 
ఇంక దర్శకత్వ ప్రతిభ విషయానికి వస్తే వినాయక్ లో ఇంకా జ్యూస్ ఉంది అనే నమ్మకాలూ వగైరా ఎవరికైనా ఉంటే అవి ఈ సినిమాతో పోవటం ఖాయం.మామూలు సన్నివేశాన్ని కూడా తన టేకింగ్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళే వినాయక్ ఇందులో ఇంత నీరసంగా ఎలా తీశాడా అనిపిస్తుంది.
 
ఆది సినిమాలో విలన్ సుమోలను పేల్చివేసే సన్నివేశాన్ని ఎప్పటికైనా మర్చిపోగలమా.చిరంజీవిని టాగూర్ లో చూపించినంత పవర్ ఫుల్ గా ఈ పదిహేనేళ్ళలో ఇంకెవరైనా చూపించగలిగారా. వెంకటేష్ లాంటి క్లాస్ హీరోతో లక్ష్మిలో చేయించిన ఫైట్లు మరొకరు చేయించలేకపోయారు.బాలయ్యను కూడా చెన్నకేశవరెడ్డిలో అద్భుతంగా చూపించాడు.ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే వినాయక్ ప్రతిభ అందులో చూడొచ్చు.

కాని ఇందులో ఉన్న అద్భుత సన్నివేశాలు నిజంగా వినాయక్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడా అని అనిపించేలా ఉన్నాయి.మచ్చుకు ఫ్లైట్ ను డ్రోన్ తో అటాక్ చేయించడం, జనాలకు డబ్బులు పంచేయడం, బ్రహ్మానందం ఎపిసోడ్, సోషల్ మీడియాను వాడుకోవడం ఇలా ఒక్కటేమిటి ఆరంభం నుండి అంతం వరకు ఎక్కడా మాస్ ప్రేక్షకుడు కళ్ళప్పగించి చూసే సన్నివేశాలుగాని, క్లాస్ ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యే
సెంటిమెంట్ గాని ఏవీ లేవు.పైగా సినిమా పేరు చూసి హీరో విలన్ల మధ్య ఎంతో కొంత మాంచి మైండ్ గేమ్ ఆశించిన ప్రేక్షకులకు ఎక్కడా అలాంటి ఆనవాళ్ళు కనిపించవు.
కేవలం హీరో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయ్యి సోషల్ మీడియాను వాడుకుంటే చాలు ఇంటెలిజెంట్ అయిపోతే ఈ డిజిటల్ రోజుల్లో అందరూ ఇంటెలిజెంట్ లే.

నటీనటులు:

ఇంక నటీనటుల విషయానికి వస్తే ఇలాంటి రొటీన్ సినిమాలో ఏ హీరో అయినా చేయడానికి ఏం ఉంటుంది.తేజ్ తన పని సిన్సియర్ గా చేసుకుపోయాడు.ఇందులో తన నటనకు పరీక్ష పెట్టే స్థాయి సన్నివేశాలేమీ లేవు. పైగా వినాయక్ లాంటి పెద్ద దర్శకుడి పనిలో తేజ్ లాంటి మీడియం రేంజ్ స్టార్ వేలు పెట్టి కేలికేసి ఉంటాడు అనుకోలేం.కాబట్టి ఇందులో తేజ్ పరిస్థితి చూసి జాలిపడటం తప్ప చేయగలిగేదేమీ లేదు.

హీరొయిన్ లావణ్య పాత్ర సినిమాకు పెద్దగా పనికి వచ్చేది కాదు.అయినా ఇలాంటి సినిమాల్లో హీరోయిన్ లకు ప్రాధాన్యత ఎప్పుడు ఇచ్చారు గనుక.తన వరకు గ్లామర్ గా కనిపించింది.అంతే. నాజర్ మాత్రం తన పాత్ర బాగా చేశాడు.చెప్పేదేముంది,ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండి.విలన్ బ్యాచ్ రాహుల్ దేవ్, వినీత్ కుమార్, ఆశిష్ విధ్యార్ది పాత్రలు పరమ రొటీన్. గత పుష్కర కాలంగా ప్రతి మాస్ సినిమాలో చూస్తున్న విలన్లకు ఏమాత్రం తీసిపోరు.సూట్లు బూట్లు.అవే అరుపులు.అవే బఫూన్ వేషాలు.

ఇంక మ్యూజిక్ విషయానికి వస్తే తమన్ ఎప్పటిలాగానే మాస్ సన్నివేశాలకు మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు.పాటలు మాత్రం ఏమాత్రం ఆకట్టు కోవు.అలనాటి చిరంజీవి క్లాసిక్ సాంగ్ చమక్ చమక్ ను ఇందులో రీమిక్స్ చేసాడు.దాన్ని విజయవంతంగా చెడగొట్టాడు. ఇకమీదైనా తమన్ ఈ రీమిక్సులు ముట్టుకోకపోతే మంచిది.

వినాయక్ గురించి మరోసారి మాట్లాడుకుంటే ఖైది నెంబర్ 150 సక్సెస్ లో వినాయక్ టాలెంట్ ఎంతో కీలకం నే భ్రమలో ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఇంటెలిజెంట్ కనువిప్పు కలిగిస్తుంది. "అదుర్స్" తరువాత తన మార్క్ టేకింగ్ చూపించిన సినిమా ఒక్కటి కూడా లేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన స్టామినా మీద ఎవరికీ సందేహాలు లేకపోయినా కథ జడ్జిమెంట్ విషయంలో వేస్తున్న తప్పటడుగులు, నీరసమైన టేకింగ్ కొత్త డౌట్లు వచ్చేలా చేస్తున్నాయి. ఓ మోస్తరుగా ఆడిన "నాయక్" ను మినహాయిస్తే బద్రినాథ్, అల్లుడు శీను, అఖిల్ చక్కటి ఫ్లాపులు.ఐతే అవన్ని కథ వల్ల బాల్చి తన్నేసినా టేకింగ్ బాగానే ఉంది కానీ ఇప్పుడు ఇంటెలిజెంట్ మాత్రం వినాయక్ టేకింగ్ మీద కూడా ఆశలు పోగొట్టేలా ఉంది.

ఇప్పటికే స్టార్ హీరోలు మొహం చాటేస్తున్నారు .వినాయక్ ఇంకొక సినిమా ఇలా తీస్తే చాలు మీడియం రేంజి హీరోలు కూడా దూరం పెట్టడం ఖాయం.

ఈ మిలీనియంలో తెలుగులో మాస్ సినిమాను కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు వినాయక్.ఆ పేరు అలాగే కొనసాగాలి అంటే కథల మీద టేకింగ్ మీద ఆయన మరిన్ని కసరత్తులు చేయక తప్పదు.

చివరి మాట: స్పెల్లింగ్ లోనే కాదు సినిమాలో కూడా తప్పులున్నాయి.
రేటింగ్       :         2/5

- భాను చందర్