ప్రేమికుల రోజు స్పెషల్

Posted on : 13/02/2018 07:17:00 pm

కొత్త పండగొచ్చింది. దేశ యువత, ఆ మాటకొస్తే ప్రపంచ యువత మొత్తం ఎదురుచూస్తోన్న ఉత్సవం రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లమంది ఆ మాటకొస్తే మనదేశంలో కూడా కోట్ల మంది యువత
ఎంతో ఉత్సాహంగా ఉరకలేస్తున్నారు ఈ ఉత్సవ మాధుర్యాన్ని జుర్రుకోవడానికి. ఇంతమంది వెర్రెత్తిపోతున్నారు అంటే ఇంత కన్నా గొప్ప ఉత్సవం మరొకటి ఉండకపోవచ్చు, ఖచ్చితంగా అది రాకెట్ ప్రయోగం కన్నా గొప్పదే అయ్యుంటుంది అనే భ్రమలు అక్కర్లేదు.అంత గొప్పది ఐతే ఖచ్చితంగా కాదు.

కానీ మన దేశంలో కొన్ని అతివాద శక్తులు సంప్రదాయాల పేరుతో ఆ ఉత్సవాలను వ్యతిరేకిస్తున్నాయి. ఇష్టపడేవారు ఒకవైపు వ్యతిరేకించే వారు మరోవైపు ఉన్న ఈ ప్రేమికుల దినోత్సవం గురించి కాస్త మాట్లాడుకుందాం. ఇది ప్రేమ వివాహానికి సంబంధించిన చర్చ కాదు.కేవలం ఆ దినోత్సవం మీద మాత్రమే. గమనించాలి.

ఇక విషయంలోకి వెళితే గడిచిన కొన్నేళ్ళుగా ప్రేమికుల రోజున పలు సంఘాలు సంస్కృతి పరిరక్షణ, విదేశీ ఆచారం అనే పేరుతొ నానాయాగీ చేస్తున్నాయి. మరోవైపు ప్రేమికులకు మద్దతుగా మరికొన్ని సంఘాలు మాట్లాడుతున్నాయి. రెక్కాడితే గానీ డొక్కాడని వర్గాలకు ఈ వ్యవహారాలతో సంబంధం లేకున్నా, తెలిసో తెలియకో వాళ్ళ పిల్లలు కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు కనుక ఇది కేవలం కలిగిన వారి పిల్లలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు గనుక చర్చకు దిగవలసివస్తోంది.

ఏ మాత్రం చరిత్ర పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం లేకున్నా భేషుగ్గా అభిప్రాయం చెప్పగలిగే, కుదిరితే చర్చల్లోకి దిగి ఆ పైన గొడవల దాకా వెళ్ళగలిగే సౌలభ్యం ఉన్న అతి కొద్ది విషయాల్లో ప్రేమ వ్యవహారాలు మొదటి ఐదు స్థానాల్లో ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ చర్చకు మనకు ప్రత్యేక అర్హతలు అక్కరలేదు. ప్రేమించే మనసు, ప్రేమను అర్ధం చేసుకునే గుణం, పక్క వారి ప్రేమకు విలువ ఇవ్వగలిగే సంస్కారం ఉంటే చాలు.

ఈ ప్రేమికుల దినోత్సవం ఎప్పుడు ఎక్కడ మొదలైంది అనేది ఇతమిద్దంగా తెలియదు. తెలుసుకోవాలనే కుతూహలం కూడా లేదు. కారణం ప్రపంచ మానవాళికి ప్రేమికుల దినోత్సవాలు కొత్త కానీ ప్రేమ కాదు. ప్రేమ పెళ్ళిళ్ళు గంధర్వ వివాహాల పేరుతొ మన ఇతిహాసాల్లో దర్శనమిస్తాయి. ప్రపంచమంతా ఆయా దేశాల్లో రకరకాల పేర్లతో వాడుకలో ఉన్నాయి. కాబట్టి ఇదేదో ఒక ప్రాంతానికే అంటుకున్న జాడ్యం కాదు. ఒక జాతి వారు మాత్రమే అనుభవిస్తున్న సంతోషం అంత కన్నా కాదు.కుల మతాలతో సంబంధం లేకుండా వందల ఏళ్లుగా కుదిరితే బహుశా వేల ఏళ్ళ ముందు నుంచి ఈ ప్రేమ వ్యవహారాలు ఉన్నాయి.

సమాజ గమనంలో, వివాహ వ్యవస్థలో ప్రేమ వివాహానికున్న ప్రాధాన్యత, దాని చుట్టూ అలుముకున్న వివాదాలు, సంఘ కట్టుబాట్ల మీద అది చూపిన ప్రభావం తక్కువేమీ కాదు.

కానీ ఈ మధ్య ప్రేమ దినోత్సవాల పేరుమీద జరుగుతున్న వివాదాలు బాధను కలిగిస్తున్నాయి.వీధుల్లో వెళుతున్న అన్నా చెల్లెళ్ళను వేధిస్తున్న అల్లరి మూకలు ఉన్నాయి. అమ్మానాన్నల కళ్ళు గప్పి పార్కుల్లో వెర్రి వేషాలు వేస్తున్న జంటలూ ఉన్నాయి. ఐతే ప్రేమికుల రోజున జరిగే ఈ సంఘటనలకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. మామూలు రోజుల్లో ప్రేమ జంటల ప్రణయ కలాపాలను దొంగచాటుగా చూసి ఆనందించే అల్లరి మూకలు ప్రేమికుల రోజున అదే జంటలను సంఘ సంస్కర్తల వేషాల్లో వేధిస్తున్నాయి. ఐతే పార్కుల్లో కనిపించే జంటల ప్రేమ పెళ్లి దాకా వెళ్ళడమా లేదా అన్నది వారి ఇష్టం.కేవలం బాహాటంగా కలిసి తిరుగుతున్నారు అనే వంకతో దాడులు చేస్తాం అంటే అంత కన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఇందులో రెండో మాటకు తావులేదు.

ఇంక ప్రేమికుల విషయానికొస్తే కేవలం అభిప్రాయాలు పంచుకోవడానికే ఐతే ఈ డిజిటల్ రోజుల్లో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడాన్ని, సందేశాలు పంపుకోవడాన్ని ఆపగలగడం ఎవరితరం. వారి ప్రేమ ఒంటి వాంఛల కోసం మాత్రమే కాకపోతే సాయంకాలపు సగం చీకట్లో పార్కుల్లో కలవాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రేమ జంటల కలాపాలకు తమ సమస్యల్లో మునిగి ఉన్న సమాజం భద్రత కల్పించి పోలీసు రక్షణ ఇవ్వాలి అని కోరడంలో ఉన్న ఔచిత్యం ఏమిటో వారే ఆలోచించుకోవాలి. వీధుల్లో తిరగడం తమ హక్కు అని వాదించే కొన్ని జంటలకు అతివాద మూకలను ఎదుర్కొనే ధైర్యం కూడా ఉండాలి. పెద్దల ముందు గౌరవంగా నిల్చునే తెగువ కూడా ఉండాలి.

ఏదేమైనా ప్రేమ వివాహాల విషయంలో మునుపటి కట్టుబాట్లతో పోలిస్తే ఇప్పుడు సమాజంలో మెరుగైన పరిస్థితులే ఉన్నాయి. తల్లిదండ్రులు సరైన తోడును వెతుక్కునే పిల్లల ఇష్టాఇష్టాలను చాలా సందర్భాల్లో కాదనడం లేదు. ఇప్పటికీ కొన్ని వర్గాల్లో ప్రేమ వివాహాల పట్ల విముఖత ఉన్నప్పటికీ గతంలో ఉన్నంత మూర్ఖత్వం ఐతే లేనేలేదు. కాబట్టి ఈ ఒక్కరోజు వీధుల్లో పార్కుల్లో కలిసి తిరగక పొతే వచ్చే నష్టం ఏమి లేదు. తిరిగే స్వేఛ్చ, హక్కు వారికీ ఉన్నప్పటికీ పోలీసులను, మేధావులను, సమాజ శ్రేయస్సుకోసం పాటుపడుతున్న వ్యక్తులను ఇలాంటి పనుల కోసం వారి శ్రమను వెచ్చించమనడం ఎంత వరకు సబబు అనేది యువత ఆలోచించాలి.

మరోవైపు అతివాద మూకలను వ్యతిరేకించే వంకతో ప్రతి యేడూ కొన్ని టెలివిజన్ చానళ్ళు ఆ ఒక్క రోజు చర్చలూ, లైవ్ కవరేజిలతో ఊదరగొడుతున్నాయి. స్వయం ప్రకటిత మేధావులను, కుహనా విమర్శకులను పట్టుకొచ్చి వారి పనికి మాలిన అభిప్రాయాలను జనాల మీద రుద్దుతున్నాయి. వీరిలో కొంత మంది కొన్నిసార్లు చాలా చక్కని మంచి విశ్లేషణలు చేస్తారు. పరిష్కారాలను చెబుతారు.ఐతే అది బహు అరుదు.ఇందులో గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఈ ప్రేమ దినోత్సవాలను సమర్ధించే వాళ్ళు ఎవ్వరూ ఆ రోజు తమ పిల్లలను అదే పార్కుల్లో తమ ప్రేమికులతో కలవడానికి పంపరు .లైవ్ షోల్లో చూపించరు. ఎందుకంటే వారు తమ పిల్లలు కదా. ఆ మాత్రం జాగ్రత్త సహజం. యువకులు కూడా తమ సోదరీమణులను తీసుకువెళ్ళి వాళ్ళు ప్రేమించిన వాళ్ళతో కలపరు. ఈ విషయం అందరూ గమనించాలి.

ప్రేమించి మోసపోయిన వాళ్ళమీద సమాజానికి జాలి ఉండాలని లేదు. అలా ఏ చట్టం చేయలేము. కానీ మోసపోయినా సరే, కూతుళ్ళను, కొడుకులను ఓదార్చి కొత్త జీవితం ఇచ్చేది తల్లిదండ్రులే. కాబట్టి ఈ విషయంలో ఎవరి మాట వినాలి అనే నిర్ణయం పూర్తిగా యువతదే. ఆ నిర్ణయానికి తగ్గట్లే ఫలితాలు ఉంటాయి. వాటికి బాధ్యులు కూడా వాళ్ళే. ఇది నిష్టుర సత్యం. ఈ సంగతి కూడా యువత గుర్తుంచుకోవాలి.

ఉద్యోగాలు సంపాదించుకోవడంలో యువత పడుతున్న కష్టాలు, సమాజంలో ఏటికి ఏడు వస్తున్న మార్పులు వారి పెళ్లి వయసును ఇరవైల చివరకు తెచ్చాయి. ఇక యాభై ఏళ్ళు వచ్చినా తన కన్నా ముందు పుట్టిన వాళ్ళ మాట జవదాటని వ్యక్తులున్న రోజుల నుంచి పదిహేనేళ్లకు పైన పది రోజుల వయసు వస్తే చాలు, తమ నిర్ణయాలు తామే తీసుకోగలం అనే పిల్లలున్న రోజుల్లో ఇలాంటి సున్నితమైన విషయాల మీద ఒక నిర్ణయానికి రావడం అంత తేలిక కాదు. కానీ ఎంత సున్నితమైన అంశమైనా, ఎంత వివాదాస్పదం అయినా ఏదో ఒక దశలో ఏదో ఒక నిర్ణయం తీసుకోకతప్పదు.

కాబట్టి యువత ఇలాంటి అనవసరపు దినోత్సవాల జోలికి పోకుండా కాస్త జాగ్రత్తగా తమ ప్రేమను కాపాడుకుని, కుదిరితే జీవితంలో స్థిరపడి పెద్ద వాళ్ళ ముందు నిలబడే ప్రయత్నం చేయాలి. అప్పటికీ పెద్దలు ఒప్పుకోకపోతే అర్హత కలిగిన నిజమైన ప్రేమ జంటలను ఒక్కటి చేసే మిత్రులు, ఆదుకునే మహానుభావులు, తోడ్పాటునందించే సంస్థలు, కాపాడే చట్టాలు ఈ రోజుల్లో లెక్కలేనన్ని ఉన్నాయి.

ఇక నిర్ణయం యువతదే....

- భాను చందర్ చందుపట్ల