రాజ్యమా నీ పయనమెటు?

Posted on : 13/02/2018 09:11:00 pm

ఒక యజమాని తన పనివాడికి వంద రూపాయలిచ్చి ఏం చేయాలో ఏం కొనాలో చెప్పకుండా పంపించాడు. ఆ పనివాడు వెళ్లి వాడికి నచ్చింది కొనుక్కొచ్చి యజమాని చేతిలో పెట్టాడు. యజమానికి కోపమొచ్చింది. కానీ ఏమీ అనలేకపోయాడు. ఎందుకంటే డబ్బులిచ్చి పంపేముందు ఏం చేయాలో ఏం కొనాలో యజమాని చెప్పలేదు. మరోచోట యజమాని క్లేయర్ గా చెప్పి పంపించాడు. పనివాడు అలాగే చెప్పింది చేసి అడిగింది కొని తీసుకోచ్చాడు. విషయం చెప్పకుండా ఏమిటీ సోది అనిపిస్తోందా. ఏమిలేదు మన దగ్గర కేంద్ర రాష్ట్రాల స్థాయిలో జరుగుతున్న ఎనికల వ్యవస్థ గురించి సింపుల్ గా చెప్పడానికి తట్టిన ఒకానొక ఆలోచన అంతే. గొప్పగా అనిపించకపోతే వదిలేయండి. ఇంతకన్నా మంచి ఉదాహరణ తగిలితే పక్క వాళ్ళకు చెప్పి పుణ్యం పొందండి. ఇక విషయంలోకి వస్తే ....

దేశాధ్యక్షుడిని ప్రజలే ఎన్నుకుంటే ఉండే ప్రయోజనాలేంటో అమెరికా మరోసారి ప్రపంచానికి తెలిసేలా చేస్తోంది. ఈ మధ్య ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను గురించి అమెరికాలో కొంత మంది డికిపోతున్నారు.
ఇంకొంత మంది నది వీధుల్లో ట్రంప్ బొమ్మను కాళ్ళతో తంతున్నారు. పంది వేషంలో ఉరేగిస్తున్నారు. మన దగ్గర అల్లాంటి ధైర్యం ఏ సాధారణ భారతీయుడి నుండయినా ఉహించగలమా అన్న అలోచలోంచి ఈ చర్చ మొదలయింది. ప్రతీకార రాజకీయాలకు ఆలవాలమైన మన దేశంలో ఏదో ఒక పార్టీ సహకారం లేకుండా కనీసం వంద మందయినా ఏదైనా ఉద్యమం చేయగలరా. తమకు నచ్చని ప్రధానిని, రాష్ట్రపతిని నడి వీధుల్లో విమర్శించగలరా? అంతర్జాతీయ రేట్లతో సంబంధం లేకుండా పెట్రోలు రెట్లు పెంచినా, తమ పార్టీలోని క్రిమినల్స్ ని వెనకేసుకోచ్చినా, ఐదేళ్ళు ముగిసాక మళ్ళీ అతను ప్రధాని కాకుండా తన వోటుతో అతన్ని నిలబెట్టిన పార్టీలకు బుద్ధి చెప్పగలరా? అసాధ్యం. కానీ అమెరికాలో సాధ్యం .ఇంకొన్ని అధ్యక్ష తరహా దేశాల్లోను సాధ్యమే.

ఇక అమెరికా సంగతి చూస్తే ట్రంప్ ఎలాంటివాడైనా గెలిచాడు కాబట్టి అతనే ప్రెసిడెంట్. ఇందులో ఇంకో మాట అనవసరం. పైగా ట్రంప్ దొడ్డి దారిలో ఎంపీల ప్రాపకం సంపాదించి అధ్యక్షుడవలేదు. ట్రంప్ ను ఎన్నుకోమని ప్రజలే కొందర్ని తమ వోట్లతో నియమించారు. కానీ ట్రంప్ చేసిన చట్టాలు కొందరు అమెరికన్లకు సంబరాన్నిస్తే మరికొందరు అమెరికన్లకు కోపం తెప్పించాయి. అమెరికన్లతో పాటు చాలామంది వలసవాళ్ళు కూడా ట్రంప్ మీద విరుచుకుపడుతున్నారు. ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగితే ట్రంప్ ను దించేయడం ఖాయమనే చర్చ కూడా అక్కడ నడుస్తోంది. ప్రధానంగా ఈ నిరసనలన్నీ అక్కడికి వలసపోయిన బయటి దేశాల వారికి కష్టం కలిగించేవి కాబట్టి మనలాంటి వాళ్ళంతా ట్రంప్ ను ఒక దుర్మార్గుడిగా చూస్తున్నాం. ఇందులో తప్పున్నా ఒప్పున్నా ట్రంప్ నిర్ణయాల గురించో అతని వ్యక్తిత్వం గురించో ఇక్కడ చర్చించబోవడం లేదు. చర్చంతా కేవలం ఒక దేశానికి అధ్యక్షా తరహా విధానం ఉత్తమమా మనలాంటి పరోక్ష ప్రజాస్వామ్యం మంచిదా అన్నదే. మన విధానాలను, అమెరికా పరిస్థితులను ఒకసారి చూస్తే ఇప్పుడు అక్కడ జరుగుతున్న రచ్చ అంతా కొందరికి విసుగు తెప్పించవచ్చు. ఇలాంటివాడు ఎన్నికయితే ఇలాగే ఉంటుందని తమ విశ్లేషణా పటిమను ప్రదర్శించవచ్చు. కానీ అందరూ వదిలేస్తున్న విషయం ఏమిటంటే ఒక వ్యక్తి తనకూ తన దేశానికీ మంచిది అనుకున్న నిర్ణయాన్ని అక్కడ అమలు చేయగలుగుతున్నాడు. అందులో కొన్ని తప్పులుండచ్చు. కొన్ని అక్కడి కాంగ్రెస్ సెనేట్ ఒప్పుకోకపోవచ్చు. కానీ తను అనుకున్నది చేయటం కోసం ప్రయత్నించడంలో అధ్యక్షుడికి అక్కడ ఏ అడ్డూ లేదు. మన దగ్గర మంచి చేయలేరు. చెడును ఆపలేరు .

అధ్యక్షుడిని విమర్శించే అలాంటి ఆలోచన ఇక్కడ సాధ్యమా? అస్సలు కాదు. ఎందుకంటే మన ప్రధానమంత్రినో అధ్యక్షుడినో మనం ఎన్నుకోలేము. అదేంటి మనం వోట్లు వేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలే కదా వారిని ఎన్నుకునేది అంటూ గొనుక్కోవచ్చు. కానీ లోతుగా చూస్తే మనకు నచ్చిన వాడిని ఎన్నుకోవడానికి మనం ఏమ్పీలనూ ఎమ్మెల్యెలనూ ఎన్నుకోవట్లేదు. మనం ఎవర్ని ప్రధానిని అధ్యక్షుడిని చేయాలో నిర్ణయించుకోకుండానే వీళ్ళకు వోట్లేస్తున్నాం. తరువాత వాళ్ళూ వాళ్ళూ ఒకటి. తమ కాంట్రాక్టుల జోలికి రానివాళ్ళకు, కొత్త కాంట్రాక్టులు ఇచ్చేవాళ్ళకు, వెనకాల అన్ని రకాల తప్పుల్నీ వదిలేసేవాళ్ళకు, ఇవన్నీ లేకుంటే ఒకేసారి నోట్ల మూటల్ని ముట్టజేప్పే పార్టీలు ఎవర్ని నిలబెడితే వాళ్ళకే తమ వోట్లు గుద్దుతున్నారు.

ఇందులో ప్రజల భాగస్వామ్యం ఏది ? పెట్రోలు ధరలు పెంచినా, కుంభకోణాల్లో చిక్కుకున్నా, దిక్కుమాలిన నిర్ణయాలు తీసుకున్నా పదవిలో ఉన్నన్నాళ్ళూ కనీసం నోరు తెరిచి మాట్లాడకున్నా తరువాతి ఎన్నికల్లో వాళ్ళను తిరస్కరించలేము. మళ్ళీ పాత పద్దతిలోనే పాత పార్టీలకే ఓట్లు వేస్తాం. వాళ్ళు ప్రజల డిమాండ్లు పక్కనపెట్టి వాళ్ళ డిమాండ్లు తీర్చేవారికి పట్టం కడతారు. మళ్ళీ కథ మొదటికొస్తుంది. అవే నిర్ణయాలు ప్రజల ఆగ్రహాలు టీవీల్లో కూడబలుక్కున్న చర్చలు రాస్తారోకోలు. అందుకే ఈ విధానం ముందు మారాలి. తరువాత అన్నీ అవే మారుతాయి.

అలాగని ప్రజలెన్నుకున్న అధ్యక్షులంతా ప్రజలకోసమే బతుకుతారనీ కాదు. పరోక్ష పద్దతిలో ప్రధానులైన వారంతా దద్దమ్మలనీ కాదు. కానీ ఇలాంటి వ్యవస్థ మార్చాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళంతా అదిరిపడటంలోనే తెలుస్తోంది. అదెంత జవాబుదారీ వ్యవస్థ అన్నది. ప్రజలే ఎన్నుకునే వ్యవస్థలో బహుశా ఒక వెధవ ఒకసారే ఎన్నికవగలడు. అతనే మళ్ళీ మళ్ళీ ఎన్నిక కాలేడు. కానీ ప్రజల భాగస్వామ్యం లేని మన ఎన్నిక పద్దతిలో ఒకే వెధవ మళ్ళీ మళ్ళీ జనాల నెత్తిమీద కూర్చుంటాడు.

ఎంత మంచి వ్యవస్థలోనైనా అధ్బుతాలు అన్ని సార్లూ జరగవు. ఎంత ఉత్తమ అధ్యక్షులైనా అన్నిసార్లూ ప్రజలు మెచ్చే నిర్ణయాలే తెసుకోలేరు. కానీ కనీసం ప్రజలు తమను తరిమి కొడతారన్న భయమైనా ఉంటుంది .మన దగ్గర కూడా అలాంటి ఎన్నికలే కావాలంటే మన నేతాశ్రీ లు వెంటనే ఒప్పుకోరు. పైగా ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో ఒకే సారి ఎన్నికలు జరపడం కష్టం అంటూ వంకలు మొదలెడతారు. వారి ఉద్దేశం ఏదైనా అందులో నిజం ఉంది. నూట ముప్పయ్ కోట్ల మంది ఒకేసారి ఓటు వేయడం కష్టమే. అయితే చిన్న చిన్న మార్పుల ద్వారా ఇది సాధ్యమే. దేశాధ్యక్షుడి ఎన్నికలో రాష్ట్ర ఎమ్మెల్యేలకు ఓటు హక్కు తీసేసి కేవలం ఎంపీలను మత్రమే అందుకు అనుమతించాలి. అద్యక్షుడి పదవికి పోటీ పడే అభ్యర్దులంతా తమ వెంట ఉండే వాళ్ళను ఎంపీలుగా ఎన్నికల్లో నిలబెట్టాలి. అప్పుడు ప్రజలే నిర్ణయించుకుంటారు. ఎవరికీ ఓటు వేయాలో.

ఈ మధ్య కేంద్రంలో రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు జరపాలంటూ మోడీ గారు కొత్త పల్లవి అందుకున్నారు. ఖచ్చితంగా అది ఆచరణలో అసాధ్యం. రోజుకో రాష్ట్రంలో ప్రభుత్వాలు కూలిపోతూ ఉంటాయి. ఇందుకు ఏ ఒక్కర్నీ తప్పు పట్టలేము. మూల సుత్రాల్లోనే లోపాలున్నప్పుడు ఉన్న ఫళంగా మార్పులంటే అది దేశవ్యాప్త గందరగోళానికి దారి తీయడం తప్ప నిజంగా ఒరిగేది శూన్యం. కులాల వారీగా వర్గాల వారిగా ఒక్కో రాష్ట్రములో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. అవన్నీ ఒకేతీరులో ఐదేళ్ళూ కుదురుగా ఉండాలంటే అయ్యేపని కాదు. ఒక రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం కూలిపోతే దేశ మొత్తం ప్రభావితం అవకూడదు. కావాల్సిన మెజారిటీని మరి కాస్త పెంచితే చాలు చాలాసార్లు ఇలాంటి సంక్షోభాలనుంది బయట పడొచ్చు. నిజంగా అ పరిస్థితి వచ్చినా ఇప్పుడున్నన్నంత దారుణమైతే కాదుగా. కాబట్టి కావాల్సింది దేశమంతా ఒకేసారి ఎన్నికలు కాదు. ప్రధాని, రాష్ట్రపతి ఒకేసారి ఎన్నికవడం. అప్పుడు ఇద్దరి మధ్యా పరిపాలనా పరమైన అభిప్రాయ భేదాలే తప్ప ఇప్పటిలా పార్టీ పరమైన విభేదాలకు ఆస్కారం తక్కువ ఉంటుంది. ఇదే విధానం రాష్ట్రాలలో కూడా తీసుకురావాలి. గవర్నర్ మీద కేంద్ర పెత్తనం తగ్గించాలి.

విభిన్న పార్టీల నేపధ్యంతో కేవలం పార్టీ ఎంపీల దయతో ఎన్నికైన రాష్ట్రపతి, ప్రధానమంత్రిల మధ్య సామరస్య వాతావరణాన్ని ప్రతిసారీ ఆశించలేం. ఇద్దరూ ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి కలిసినప్పుడు వారి మధ్య ఉండే వాతావరణం ఎలా ఉంటుందో ఉహించడం కష్టం కాదు కదా. అదే ఇద్దరూ ఒకే జట్టు వారైతే పాలనా పరమైన నిర్ణయాలు త్వరగా చేసే వీలుంటుంది. కొన్నిసార్లు ఒకే ఇద్దరూ ఒకే పార్టి వాళ్ళు అయినా సమస్యలు రావచ్చు కానీ ఇప్పటికన్నా మెరుగే. ఇక ఏ పార్టీ ఎన్నికవుతుందనేది అనవసరం. కానీ ప్రజలు కోరుకుని ఎన్నుకున్న వారే మొదటి ప్రజా సేవకులుగా ఉండాలి. అప్పుడే అనవసర వైరుధ్యాలకు ఆకాశం తగ్గుతుంది. ఇలా అధ్యక్షుడిని ప్రధానమంత్రి ఒక్కటిగా పోటికి దిగి వారిని ప్రజలే ఎన్నుకున్నప్పుడే వాళ్ళకు కూడా ఇలా ఎంపీల బెదిరింపులు, కార్పోరేట్ వేధింపుల నుండి విముక్తి వచ్చి ఏదైనా మంచి చేయాలని ప్రయత్నిస్తారు. ఏదైనా మంచిపని చేయాలి అనుకుంటే అడుగు ముందుకు వేయగలరు. అప్పుడే ఇలా పార్టీ అధ్యక్షుడి అధ్యక్షురాలి ప్రాపకం కోసం వెంపర్లాడే పరిస్థితి కూడా పోతుంది.

ఇక్కడ ఎన్నికయ్యే వారి తెలివెంత? ప్రజలెన్నుకునే వారి గుణ గణాలేమిటన్నచర్చ అనవసరం. అది ప్రజలే చూసుకుంటారు. ఇప్పటిలా తమ ఆకాంక్షలకు సంబంధం లేకుండా పాలించే పాలకులను కాకుండా తామెవరిని నమ్మితే వారినే నియమించుకుంటారు. తరువాత జరిగేది ఏదైనా ఇప్పటికంటే మెరుగేనన్న విషయంలో ఇక రెండో మాట అక్కర్లేదు.

రాజ్యాంగ నిబంధనల మార్పు ఒక్కరోజుతో అయ్యేది కాదు. మార్పులు కూడా వెంటనే ఫలితాలనివ్వవు . కాబట్టి ఇలా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి తప్పదు.

- భాను చందర్ చందుపట్ల