చేసిందంతా చేసి, ఇదో కొత్త డ్రామా!

Posted on : 17/02/2018 12:00:00 pm

ఇంటికి నిప్పు పెట్టి ఫైరింజ‌న్‌కు ఫోన్ చేసిన‌ట్లుంది. కాంగ్రెస్ ప‌రిస్థితి. ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్‌ను విభ‌జించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడేమో ఆంధ్రాలో ప‌రిస్థితుల‌కు కేంద్రంలో బీజెపి, ఆంధ్రాలో తేదెపాలేన‌ని కొత్త పాట పాడుతోంది కాంగ్రెస్ పార్టీ!
ఇన్ని అన‌ర్థాల‌కు కార‌ణ‌మైన కాంగ్రెస్ ప్ర‌త్యేక హోదాకోసం ఈ నెల 19న గుంటూరు క‌లెక్ట‌ర్ కార్యాల‌యం బ‌య‌ట ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వ దీక్ష పేరుతో నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. విభ‌జ‌న నేప‌థ్యంలో రెండు రాష్రాల‌లో ఉన్న ప‌రిస్థితులు, వ‌న‌రులు, ఆదాయ మార్గాలు రాజ‌ధాని నిర్మాణం, న‌వ్యాంధ్ర‌, భ‌విష్య‌త్తు ఇలాంటి అంశాల‌పై ఏమాత్రం దృష్టి పెట్ట‌ని యుపిఎ ఇప్పుడేమో! బింక‌లేన‌మ్మ డొంక‌ప‌ట్టుకుని ఏడ్చిన చందంగా ప్ర‌వ‌రిస్తున్న తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఏపి విభ‌జ‌న స‌మ‌యంలో సీనియ‌ర్ నాయ‌కులు సైతం విభ‌జ‌నాంధ్ర ప్ర‌దేశ్ భ‌విష్య‌త్తును అంచ‌నా వేయ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. ఇప్పుడేమో ప్ర‌త్యేక హోదాకోసం తీవ్రంగా శ్ర‌మిస్తాన‌ని, పోరాటాలు చేస్తామ‌ని ర‌ఘువీరారెడ్డి చెబుతోన్న మాట‌లు హాస్య‌స్ప‌దంగా ఉన్నాయి. ప్ర‌త్యేక హోదా విష‌యంలో పార్టీ అధిష్టానం ఇప్ప‌టి వ‌ర‌కూ నోరు మెద‌ప‌లేదు, సోనియాగానీ, రాహుల్‌గాంధీగానీ ఎలాంటి హెచ్చ‌రిక‌లు బిజెపికి చేసిన దాఖ‌లాలు లేవు. రాష్ట్రానికి జ‌ర‌గ‌బోయే అన్యాయం గురించి క‌నీసం ఆలోచించ‌ని ర‌ఘువీరా అండ్ కోలు ఇప్పుడేమో దీక్ష చేప‌డ‌తాం అన‌డం విడ్డూరం కాక‌పోతే మ‌రేంట‌నే విమ‌ర్శ‌లూ వినిపిస్తున్నాయి.