కేసీఆర్ బర్త్ డేకు భారీ ఏర్పాట్లు

Posted on : 17/02/2018 03:14:00 pm

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, టీ ఆరెస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలకు ఆ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. రాష్ర్ట వ్యాప్తంగా రక్తదాన శిభిరాలు, అన్నదానాలు, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పలువురు నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలు తెలంగాణ వరకే కాకుండా,పలు దేశాలలో ఎన్నారైలు సైతం కేసీఆర్ జన్మదిన వేడుకలను జరుపుకోవడం మరో విశేషం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకించి రూపొందించిన పాటను నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ ముద్దుల తనయ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత విశేషాలను "పక్షం" మీకందించే ప్రయత్నం లో భాగంగా..

కల్వకుంట్ల చంద్రశేఖరరావు మెదక్ జిల్లా చింతమడక గ్రామంలో రాఘవరావు వెంకటమ్మ దంపతులకు 1954లో జన్మించారు. చిన్నతనం నుంచే చురుకైన విద్యార్థిగా ముద్రవేసుకున్న కేసీఆర్ తెలుగు సాహిత్యం లో ప్రవేశమే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎ తెలుగు పూర్తి చేశారు. విద్యార్ధి దశనుంచే తన రాజకీయ ప్రస్థానానికి అడుగులు పడ్డాయి. ఆనాటి తెలుగు దేశం అధ్యక్షుడు నందమూరి తారకరామారావు పిలుపు మేరకు తెలుగు దేశం పార్టీ లో చేరిన ఆయనకు ఆనాటి నుంచి ఈనాటి వరకూ రాజకీయాలలో వెనుతిరిగి చూసే అవసరమే రాక పోగా తెలంగాణ లో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగారన్నది జగమెరిగిన సత్యమే!

తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను దాటుకుంటూ చివరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఆ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా సింహాసనాన్ని అధిష్టించిన ఘణత కేసీఆర్ కే దక్కుతుంది.

కేసీఆర్ జీవితంలో కీలకమైన ఘట్టాలు ఎన్నో ఉన్నా అందులో ప్రధాన మైనది మాత్రం తెలంగాణ ఉద్యమఘట్టమని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

తెలంగాణ ఉద్యమ ఆవశ్యకతకు ముందు తెలుగుదేశం పార్టీలో పలు కీలక పదవులను సైతం అలంకరించారు సీఎం కేసిఆర్. 1985లో తొలిసారిగా తెలుగుదేశం తరపున శాసనసభకు ఎన్నికయ్యారు. 87-88 లో మంత్రి వర్గంలోనూ స్థానం సంపాదించారు. 92-93లో పబ్లిక్ అండర్ టేకింగ్ చైర్మన్ పదవి సైతం ఆయన్ను వరించింది. 1989,1994, 1999, 2001ఉప ఎన్నికల్లో సైతం ఆయన జయకేతనం ఎగురవేశారు. తేదేపాలో రవాణా శాఖామంత్రి గానూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర శాసనసభకు డిప్యూటీ స్పీకర్ గానూ ఆయన సేవలందించారు.

అనంతరం తేదేపాలో చోటుచేసుకున్న పరిణామాలు, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆవస్యకత తదితర అంశాలు ఆయన్ను సొంత పార్టీ నిర్మాణం వైపు కి నడిపించాయి. అయితే
ఈ క్రమంలో 2001లో తేదేపాలో డిప్యూటీ పదవికి పార్టీకి స్వస్తి పలికిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి అనేపార్టీతో తెలంగాణ ప్రజల సెంటుమెంటును కలగలిపి జనంలోకొచ్చారు. స్వతహాగా మాటలతో ఆకట్టుకోవడంలో దిట్టయిన కేసీఆర్ ఓటర్లను సైతం ఆకట్టుకోగలిగారు. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి2004లో గెలుపొందారు. అనంతరం యూపీఏ తోనూ జత కట్టారు. కార్మిశాఖ మంత్రిగా కూడా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. అనంతరం యూపీఎ కూటమినుంచి బయటకు రావడం, టీ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపైనా, విఠల్ రావులపైనా గెలుపొందారు.

ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో ప్రత్యక్ష ఉద్యమబాట పట్టక తప్పలేదు కేసీఆర్ కు ఓ వైపు విద్యార్థుల ఆత్మ బలిదానాలు, మరోవైపు ఉద్యమాన్ని ఆణచివేసేందుకు ప్రభుత్వం చేసే విశ్వప్రయత్నాలు వెరసి తెలంగాణా అంతటా అట్టుడికిపోయింది.

2009నవంబర్ 29న నిరవదిక నిరాహార దీక్షకు పూనుకున్నారు . ఓ వైపు ప్రజల్లో తెలంగాణా సెంటిమెంట్ నరనరాన జీర్ణించుకు పోవడం, కేసీఆర్ ఆరోగ్యం విషమించడం ఇలాంటి పరిస్థితులు ఆయన్ను తెలంగాణా లో ప్రత్యేకంగా నిలిపాయి. చెప్పుకుంటూ పోతే ఆయన జీవితం ఓ గ్రంధమే అవుతుంది.

ఉద్యమాలు, రాజకీయాలు, కుటుంబం దేని దారి దానిదే అంటారు కేసీఆర్, భార్య శోభ గృహిణి, కొడుకు కేటిఆర్ ,కూతురు కవిత కూడా తండ్రిబాటలో పయణిస్తున్న సంగతి తెలిసిందే. ఓ సాధారణ వ్యక్తిగా రాజకీయాల్లో ప్రవేశించి ఎన్నో పదవులను అలంకరించి. అర్ధాంతరంగా పదవుల్ని త్యజించి, సొంత పార్టీతో ఉద్యమ
పోరాటాలు నడిపిన కేసీఆర్ రాజకీయ జీవితం పూలపానుపేమీ కాదు, ముళ్లబాటలో నడిచారు, ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడ్డారాయన, ఇప్పుడు తెలంగాణా పీఠంపై ఒకేఒక్కడుగా కూర్చున్న సీఎం కేసీఆర్ కు  మరొక్క సారి జన్మదిన శుభాకాంక్షలు.