ఆకాశంలో సగం..మహిళా దినోత్సవానికి పూర్తి అర్ధం

Posted on : 08/03/2018 03:58:00 pm

ఇళ్లూడ్చి, ఇస్త్రీ బట్టలు అందించడానికి, మురికి బట్టలు ఉతక డానికే, స్త్రీ అంటే ఎలా? 33%శాతం రిజర్వేషన్ కల్పించి, స్త్రీలను చట్ట సభల్లోకి పంపిస్తున్నా కూడా, చాలా చోట్ల వంద శాతం బానిస గానే బతుకుతుంది స్త్రీ. ఓ పక్క విమానాలను సైతం  నడుపుతున్నా కూడా, వంటింట్లోకొచ్చే సరికి ఎంగిలి బతుకే! పెళ్లాం అందంగా ఉంటే భర్తకు అనుమానం. కూతురు అందంగా ఉంటే కన్న తండ్రికి భయం, తన కూతుర్ని ఒక అయ్యచేతిలో పెట్టే వరకూ, ఎలా కాపాడుకోవాలా అని.  తన చెల్లి ఎవరితోనైనా మాట్లాడితే సహించని అన్న, మరో ఇంటి ఆడ పిల్ల అన్నయ్య ఫీలింగ్ ని గౌరవించడెందుకనో? అమ్మ టీ పెట్టాలి, వీపు రుద్దాలి, పోపుల డబ్బా నుంచి తీసి డబ్బులివ్వాలి కొడుక్కి, అంత వరకే అమ్మ పాత్ర, అంతకు మించి అమ్మ మరొక్క మాట మాట్లాడినా, తన ఫ్రెండ్స్ ముందే కసిరి పారేస్తాడు కొడుకు. అయినా అమ్మ మగ జాతి మొత్తాన్ని క్షమిస్తుంది, ఎందుకంటే? ఆమె అమ్మ కాబట్టి, ఆమొక స్త్రీ కాబట్టి, ఆమెకు భూమాతకున్నంత ఓర్పు, సహనముంది కాబట్టి. మొదటి రాత్రి గదిలోకి పాల గ్లాసుతో వచ్చినా,  తోడబుట్టినవాడి యోగ క్షేమాలు కోరి నవ్వుతూ వచ్చి రాఖీ కట్టినా, ఆకలితో గుక్క పట్టి ఏడ్చే బిడ్డకు చనుబాలందించాలన్నా, ఈ సృష్టి లో ఒక్క స్త్రీ మూర్తికి మాత్రమే చెల్లుతుంది. నిర్భయ చట్టాలెన్నొచ్చినా స్త్రీలపై అత్యాచారాలు ఆగడం లేదు నేడు. గృహ హింస కేసులు నమోదు కాని, పోలీస్టేషన్లు కనిపించడమే లేదెక్కడ చూసినా. వరకట్న వేధింపుల కేసులు లేని కోర్టులు లేవు. ఏ రోజైతే మగాడు ప్రతి ఆడపిల్లను తనింటి ఆడపిల్లగా గౌరవిస్తాడో? అక్కడి నుంచే సమాజంలో మార్పు మొదలవుతుంది. సంఘంలో స్త్రీ గౌరవించ బడుతుంది. ఆడతనం నుంచే అమ్మతనం పుట్టేది. అమ్మను గౌరవించడమంటే? అమ్మను మాత్రమే గౌరవించడం కాదు, ఆడ జన్మ మొత్తానికి గౌరవించడం. ఆడదంటే ఆట బొమ్మ కాదు, అంగడి సరుకు అంత కన్నా కాదు. ఆడదంటే? అడ్డాలనాడు, ఉగ్గు పాలు పట్టేది. ఆడదంటే? అలుపొచ్చి రొప్పుతున్నప్పుడు నీకు చల్లని నీడనిచ్చి సేద తీర్చేది. ఆడదంటే నువు శాశ్వతంగా నిద్రించిన నాడు తన గర్భంలో నీకింత చోటిచ్చి నిన్ను తనలో కలుపు కునేది.