ప్రయాణీకుల సౌకర్యమే లక్ష్యంగా - ఇండియన్ రైల్వేస్ మరో ముందడుగు

Posted on : 10/03/2018 08:16:00 am

దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ ఇండియన్ రైల్వేస్, ఒక్కసారి టిక్కెట్టు రిజర్వ్ చేసుకొని ఏకారణం చేతయినా ప్రయాణం రద్దు చేసుకుంటే, ఆ టిక్కెట్టు క్యాన్సిల్ చేసుకోవాలంటే కొంత మేరకు టిక్కెట్టు ధరలో నష్ట పోవాల్సి వచ్చేది. పోనీ ఆ రిజర్వ్ టిక్కెట్టుపై వేరెవరైనా ప్రయాణం చేసే వీలుందా అంటే అదీ లేదు. ఇక పై ఈ కష్టాలు ఉండవంటోంది రైల్వేశాఖ. రిజర్వ్ టిక్కెట్టును వేరొకరికి బదిలీ చేసే వీలును కల్పించి ఇండియన్ రైల్వేస్ మరో ముందడగు వేసింది. కాకపోతే ఈ సౌకర్యం పొందాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తిస్తాయి అవేంటో ఒకసారి చూద్దాం.

రైల్వే ప్రయాణీకులు  ఇకపై రిజర్వేషన్ టికెట్‌ను రద్దుచేసుకునే అవసరం లేకుండా తెలిసిన వారికి లేదా బంధువులకు బదిలీచేయొచ్చు. అయితే ఇందుకోసం రైల్వే శాఖ అనుమతి తప్పనిసరి. ఈ సేవను వినియోగించుకోవాలంటే మీ టికెట్‌ కన్ఫర్మ్‌ అయి ఉండాలి.

టికెట్‌ బదిలీ చేసుకునేందుకు అనుమతిచ్చే అధికారం ముఖ్యమైన స్టేషన్లలోని చీఫ్‌ రిజర్వేషన్‌ పర్యవేక్షకులకు కల్పించారు. రైలు బయల్దేరడానికి 24 గంటల ముందు లిఖిత పూర్వకంగా అనుమతి తీసుకునే టికెట్‌ను బదిలీ చేయాలి. ఇక విద్యార్థులు టికెట్‌ను బదిలీ చేయాలనుకుంటే మాత్రం వారు చదివే విద్యా సంస్థ ప్రిన్సిపల్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఒక టికెట్‌ను ఒకసారి మత్రమే బదిలీ చేయాలి.