రోటోమ్యాక్ ఆస్తుల వేలానికి రంగం సిద్ధం

Posted on : 10/03/2018 12:08:00 pm

అనుకున్నంతా అయ్యింది దేశీయ బ్యాంకులకు మరి కొంత మేర బొక్కపడనుంది చేసేదేం లేక  ఆస్తులను వేళం వేసి చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అనేవిధంగా సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి దేశీయ బ్యాంకులకు వచ్చింది. ఇదంతా కూడా నాలుగు వేల కోట్ల రూపాయలు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని దివాలా తీసిన రోటోమ్యాక్ కంపెనీ తాలుకా వ్యవహారానికి సంబంధించి, బ్యాంకులు ఇచ్చిన గడువు ముగియడంతో, ప్రస్తుతం ఆ కంపెనీలను దివాలా కోర్టు వేలం వేయబోతుంది. రొటొమ్యాక్‌ గ్రూప్‌ కంపెనీలు 90 రోజుల అదనపు సమయం కోరగా,  మరింత సమయం ఇచ్చేందుకు బ్యాంకులు తిరస్కరించాయి. ముందస్తు ఇచ్చిన డెడ్‌లైన్‌ మార్చి 19తో ముగియబోతుంది. దీంతో విక్రమ్‌ కొఠారికి చెందిన రొటొమ్యాక్‌ ఎక్స్‌పోర్ట్స్‌, రొటొమ్యాక్‌ గ్లోబల్‌ సంస్థలను దివాలా కోర్టు వేలం వేయబోతున్నట్టు తెలిసింది. మరో రెజుల్యూషన్‌ ప్లాన్‌ లేకపోవడంతో, ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడైంది.

రొటొమ్యాక్‌ కంపెనీల రెజుల్యూషన్‌ ప్రొఫిషనల్‌ అనిల్‌ గోయల్‌ ఈ విషయాన్ని ధృవీకరించారు. బ్యాంకులు ముందస్తు ఇచ్చిన గడువును పొడగించడానికి తిరస్కరించినట్టు ఆయన తెలిపారు. శుక్రవారం తుది గడువు పొడిగింపుపై ఓటింగ్‌ కోసం సమావేశమైన క్రెడిటార్ల కమిటీ, ఈ సందర్భంగా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు ఓ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు. కొన్ని రోజుల క్రితమే రుణాల డిఫాల్ట్‌ కేసులో రొటొమ్యాక్‌ యజమాని విక్రమ్‌ కొఠారి, ఆయన కుమారుడు రాహుల్‌ కొఠారిలను సీబీఐ అరెస్ట్‌ చేసింది. వీరు విచారణకు సహకరించకపోవడంతోనే, అరెస్ట్‌ చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు.  

బ్యాంకు ఆఫ్‌ ఇండియా, బ్యాంకు ఆఫ్‌ బరోడా, ఓరియంటల్‌ బ్యాంకు ఆఫ్‌ కామర్స్‌, అలహాబాద్‌ బ్యాంకు, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్రలకు రొటొమ్యాక్‌ గ్రూప్‌ కంపెనీలు దాదాపు రూ.4000 కోట్లు బకాయి పడిన సంగతి తెలిసిందే. భారీ స్థాయిలో రుణాలు తీసుకుని స్వప్రయోజనాల కోసం దారి మళ్లించినట్లు సీబీఐ గుర్తించింది. బ్యాంకు ఆఫ్‌ బరోడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొఠారిపై సీబీఐ తొలుత ఈ కేసు నమోదుచేసింది. బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన ఎంతోమంది డిఫాల్టర్ల కంటే రొటోమ్యాక్ ఆస్తులను వేలం వేయడం ద్వారా ఎంతో కొంత నష్టాన్ని పూడ్చుకొనే వెసులుబాటు దేశీయ బ్యాంకులకు కలిగినట్లే.