ఒకప్పుడు దేశాధ్యక్షుడు - ఇప్పుడేమో మోస్ట్ వాంటెడ్

Posted on : 10/03/2018 12:23:00 pm

ఒకప్పుడు పాకిస్థాన్ లో ఆయన మాటే శాసనం. దేశాధ్యక్షుడి హోదాలో ఆయన చెప్పిందే వేదం. సైనిక పాలనలో ముషారఫ్ నాయకత్వంలో జరిగిన అక్రమాలకు, చట్టవ్యతిరేకమైన చర్యలకు ముషారఫ్ భారీ మూల్యమే చెల్లించనున్నాడు. దేశాధ్యక్షుడిగా ఒక వెలుగు వెలిగిన ముషారఫ్ నేడు ఆ దేశ న్యాయ స్థానాలకు మోస్ట్ వాంటెడ్ గా మారాడు. పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రాజద్రోహం కేసుపై విచారణ జరిపిన అక్కడి స్పెషల్ ట్రైబ్యునల్ ముషారఫ్‌ను అరెస్ట్ చేయడంతో పాటూ ఆయన ఆస్తులు జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఈ కేసు విచారణలో ముషారఫ్‌ అరెస్టుకు ఆదేశించాలని, కోర్టు ముందు హాజరుపరచాలని ప్రాసిక్యూటర్‌ అక్రమ్‌ షేక్‌ కోరారు. అతడ్ని విదేశాల నుండి వెనక్కి రప్పించాలంటే తీసుకోవాల్సిన చర్యలేంటని కోర్టు ఫెడరల్‌ దర్యాప్తు అధికారులను ప్రశ్నించింది. వారిచ్చిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకుని కోర్టు ముషారఫ్‌ అరెస్టుకు, ఆస్తుల జప్తుకు ఆదేశించింది. పాకిస్థాన్‌లో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో జడ్జిలను గృహ నిర్బంధంలో ఉంచడంతో పాటు వంద మంది న్యాయమూర్తులను తొలగించిన కేసులో 2014లో ప్రత్యేక ట్రైబ్యునల్‌ ముషారఫ్‌పై నేరాభియోగాలు నమోదు చేసింది. పెషావర్‌ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. అలాగే హోంశాఖ అధికారులు ముషారఫ్‌‌కు సంబంధించిన ఆస్తుల వివరాలను కోర్టుకు సమర్పించారు. 2016 మార్చిలో దుబాయ్‌ పారిపోయిన ముషారఫ్‌ను పరారీలో ఉన్న నిందితునిగా కోర్టు పేర్కొంది. ఈ కేసులో అభియోగాలు రుజువైతే ముషారఫ్‌కు ఉరిశిక్ష లేదా జీవితఖైదు పడే అవకాశం ఉంది. 1999 నుంచి 2008 వరకు సైనిక పాలన కొనసాగించిన ముషారఫ్‌ మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో హత్య కేసుతో పాటు వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్నారు.