అన్ని జతల చేతుల్ని అడ్డంగా నరికి పడేశారు

Posted on : 10/03/2018 03:29:00 pm

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా27 జతల చేతుల్ని అడ్డంగా నది ఒడ్డున నరికి పడేశారెవరో. చదువుతుంటేనే ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తోంది కదూ. చదవడానికే ఇలా ఉంటే ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ల సంగతి వేరే చెప్పాలా?గుండె ఆగినంత పనవదూ ఈ దృశ్యం చూసి. ఒకే చోట ఏకంగా  54 చేతులు నది ఒడ్డున లభించడంతో ప్రపంచమంతా కలవరపాటుకు గురవుతోంది. ఇది తీవ్రవాదులు చేశారా? వైద్య సంస్థలు చేశాయా?  ఏమైనా క్షుద్ర పూజలా? లేక శిక్షలా?  అని తేల్చే పనిలో రష్యన్‌ పోలీసులు నిమగ్నమయ్యారు. ఫోరెన్సిక్‌ వారికీ అంతు చిక్కకుండా చేతుల వేలిముద్రలను చెరిపేశారు.

రష్యాలోని అముర్‌ నది ఒడ్డున ఒక  సంచిలో మణికట్టు వరకు నరికేసిన మనుషుల అరచేతులు 54 కనిపించడం.. అక్కడి వారిని భయభ్రాంతులకు గురిచేసింది. పోలీసులు ఆ చేతులను స్వాధీనం చేసుకొని, ఫోరెన్సిక్‌ విభాగానికి తరలించారు. ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా ఈ మిస్టరీనీ ఛేదించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఈ చేతుల దగ్గర్లో మెడికల్‌ సామాగ్రి లభించడం, వేలిముద్రలు లభించకుండా చేతులను తరగటం ఇవన్ని పోలీసులకు అనుమానాలు కలిగిస్తున్నాయి. అసలు ఈ చేతులు ఎవరివి, మృతదేహాల నుంచి సేకరించారా లేక ఎవరినైనా శిక్షించేందుకు ఇలా నరికేశారా అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా ఎదురవుతుంటాయి. అయినప్పటికీ ఊహించడానికే భయం గొలిపే ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.