బిజెపీ తీర్థం పుచ్చుకున్నప్రముఖ సినీ నటి కవిత..

Posted on : 11/03/2018 01:32:00 pm

ఇన్నాళ్ళుగా టీడీపీలో కొనసాగిన ప్రముఖ సినీ నటి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు కవిత భారతీయ జనతా పార్టీలో ఆదివారం చేరారు. విజయవాడలో ఈ రోజు ఉదయం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి కంభంపాటి హరిబాబు సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాల స్ఫూర్తితో బీజేపీలో చేరానన్నారు. అదే విధంగా తనకు తానుగా తాను టీడీపీ నుంచి బయటకు రాలేదని, ఆ పార్టీ నుంచి గెంటి వేయబడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు కవిత. 

1983 నుంచి టీడీపి సేవ చేస్తూ వస్తున్నానని, టీడీపీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడ్డానని, టీడీపీలో అనేక అవమానాలు ఎదుర్కొన్నానన్నారు. తిట్టినవారికి పదవులు ఇస్తున్న చంద్రబాబు పార్టీ కోసం శ్రమిస్తున్నవారికి మొండిచేయి చూపిస్తున్నారని విమర్శించారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. మహానాడులో జరిగిన పరిణామాల దృష్ట్యా కలత చెందిన కవిత తెలుగుదేశం పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. పార్టీ తీరును కూడా బహిరంగంగానే విమర్శించారు.