రాయలసీమ లవ్ స్టోరీ సినిమా ప్రారంభం

Posted on : 11/03/2018 02:51:00 pm

వెంకట్ ని హీరోగా పరిచయం చేస్తూ రామ్ రణధీర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా రాయలసీమ లవ్ స్టోరీ. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకను కర్నూల్ లోని మౌర్యా ఇన్ హోటల్లో ఏర్పాటు చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ క్లాప్‌తో ''రాయలసీమ లవ్ స్టోరీ'' సినిమా ప్రారంభమైంది. నర్వా రాజశేఖర్ రెడ్డి స్విచాన్ చేసారు. హృశాలి, పావని లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. మొదటి, రెండో షెడ్యూళ్లను కూడా రాయలసీమ ప్రాంతమైన కర్నూల్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది . మూడో షెడ్యూల్ హైదరాబాద్ లో కొనసాగుతోంది . దర్శకుడు రామ్ రణధీర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సినిమాలోని కొన్ని ముఖ్య ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. 

టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఇన్నాళ్లు రాయలసీమ కథలతో వచ్చిన సినిమాలన్నీ పగ, ప్రతీకారం అంటూ ఫ్యాక్షన్‌ని మరింతగా రెచ్చగొట్టేలా సినిమాలు వచ్చాయని కానీ రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కాదు నిండు మనసున్న వాళ్ళమని చాటి చెప్పే ప్రయత్నం చేస్తోన్న దర్శకనిర్మాతలను నేను అభినందించలేకుండా ఉండలేకపోతున్నానన్నారు. ఈ లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. అలాగే చిత్ర పరిశ్రమకి చెందిన వాళ్ళు ఎవరైనా కర్నూల్‌లో స్టూడియోలు కడతామని ముందుకు వస్తే ప్రభుత్వపరంగా ఏ విధంగా అయినా తమవంతు సహకారం అందించడానికి మేమెప్పడూ సిద్ధమేనన్నారు. దర్శకులు రామ్ రణధీర్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారి అమృత హస్తాలతో మా సినిమా ప్రారంభం కావడం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. సినిమా ప్రారంభమైనప్పటి నుండి దిగ్విజయంగా షూటింగ్ జరుగుతోంది . 

ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ తో దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తయ్యింది . ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది , ఇక నాలుగో షెడ్యూల్ మళ్ళీ కర్నూల్ పరిసర ప్రాంతాల్లో జరుపుతాం దాంతో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది . నటీనటులు , సాంకేతిక నిపుణులు అందరూ సహకరించడం వల్ల అనుకున్న విధంగా షూటింగ్ పూర్తిచేయగలిగామని , అందుకు మా నిర్మాతలకు ఎంతో రుణపడి ఉంటానని అన్నారు. నిర్మాతలు నాగరాజు, హుస్సేన్, ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ రామ్ రణధీర్ చెప్పిన కథ మాకు నచ్చడంతో వెంటనే సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాం. అలాగే రామ్ రణధీర్ లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ రాయలసీమ లవ్ స్టోరీ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. టీజీ వెంకటేష్ గారు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మరింత సంతోషంగా ఉందన్నారు.