మరో అసెంబ్లీ రౌడీ కోమటిరెడ్డేనా?

Posted on : 13/03/2018 09:58:00 am

తొలి రోజే బడ్జెట్ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని స్థంబింపజేశారు. రైతు సమస్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పెద్ద ఎత్తున నినాదాలతో బీజేపీ అవలంభిస్తోన్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై గందరగోళం సృష్టించారు. సోమవారం ఉదయం పదిగంటలకు ప్రారంభం కావాల్సిన అసెంబ్లీ సమావేశం అయిదు నిముషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఆవేశంతో ఊగిపోయిన కాంగ్రెస్ నేతలు గవర్నర్ ప్రసంగ ప్రతుల్ని చింపేయడమే కాకుండా అసెబ్లీలో ఎదురుదాడికి దిగడంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది.

దళిత వ్యతిరేక విధానాలు, నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలపై కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ  ఒక్కసారిగా వెల్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన మార్షల్స్‌ కాంగ్రెస్‌ సభ్యులను వెల్‌ వైపు రాకుండా అడ్డుకున్నారు. దీంతో మార్షల్స్‌ కాంగ్రెస్‌ సభ్యుల మధ్య తోపులాట కొనసాగింది. అదే సమయంలో కొందరు సభ్యులు గవర్నర్‌ ప్రసంగ ప్రతులను చించి వెల్‌లోకి విసిరేశారు. ఘర్షణ వాతావరణం కొనసాగడంతో మార్షల్స్‌ నాలుగు వలయాలుగా ఏర్పడి కాంగ్రెస్‌ సభ్యులను ప్రతిఘటించారు.

అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం కొనసాగినంత సేపు కాంగ్రెస్‌ సభ్యులు జీవన్‌రెడ్డి, సంపత్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, డీకే అరుణ, గీతారెడ్డి, సంతోష్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి వెల్‌లోకి చొచ్చుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు. చించిన కాగితాలు పోడియంపైకి మరింత బలంగా విసిరేందుకు పోటీ పడ్డారు. అదే సమయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి  తమ సీట్లకు అమర్చిన హెడ్‌ఫోన్స్‌ను విరిచేసి గవర్నర్‌ వైపు విసిరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి  విసిరిన హెడ్‌ఫోన్స్‌ ఏకంగా గవర్నర్‌ ప్రసంగిస్తున్న వేదికపైకి దూసుకెళ్లింది. వెనుక ఉన్న గోడకు తగిలి గవర్నర్‌ పక్క సీటులో ఉన్న శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌కు తగిలడంతో  ఆయన కంటికి  గాయమైంది. దీంతో  అసెంబ్లీ సిబ్బంది ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.

ఈ పరిస్థితిని ముందుగానే పసిగట్టిన ప్రభుత్వం గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందుగానే అప్రమత్తమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోడియం పక్కనే భారీ సంఖ్యలో మార్షల్స్‌ను మోహరించింది. కాంగ్రెస్‌ సభ్యులు అసెంబ్లీలోకి అడుగు పెట్టగానే ఎమ్మెల్యే డీకే అరుణ ఇదేమన్నా పోలీసు రాజ్యమా? అసెంబ్లీనా? ఇంతమంది పోలీసులెందుకు అని ప్రశ్నించారు. అసెంబ్లీ నుంచి జానారెడ్డి తో సహా కొంతమంది కాంగ్రెస్ నేతలు మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు.

ఓ వైపు కాంగ్రెస్‌ నేతల  నిరశలు, ఆందోళనలతో అసెంబ్లీ మొత్తం గందరగోళంగా మారితే,  మరోవైపు బీజేపీ సభ నుంచి వాకౌట్‌ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అబద్ధాలను భరించలేకపోతున్నామని, గవర్నర్‌తో నాలుగేళ్లుగా ప్రభుత్వం ఇదే ప్రసంగాన్ని చెప్పిస్తోందని, అందుకే వాకౌట్‌ చేశామని ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో  నిన్నటి సీన్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీ రౌడీని తలపించారని పలువురు వ్యాఖ్యానించారు. ఏదేమైనా తొలి రోజు బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీని రణరంగంగా మార్చేశాయని చెప్పక తప్పదు.