కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు

Posted on : 13/03/2018 10:59:00 am

తొలి రోజు బడ్జెట్ సమావేశాలకు అంతరాయం కలిగించడమే కాకుండా అసెంబ్లీలో దాడికి పాల్పడి భయాందోళనలు సృష్టించిన ఘటనలో కోమటి రెడ్డితో సహా మరో 11 మంది కాంగ్రెస్ శాసన సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. గవర్నర్ ప్రసంగం సమయంలో కోమటి రెడ్డి విసిరిన హెడ్‌ఫోన్ చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తాకడంతో ఆయన కంటికి గాయమైన సంగతి తెలిసిందే.  స్వామిగౌడ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. గవర్నర్ ప్రసంగానికి ఆటకం కలిగిస్తూ, నినాదాలు చేసిన డీకే అరుణ, జానా రెడ్డి, పద్మావతి, రామ్మోహన్ రెడ్డి, మాధవ్, భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి, గీతా రెడ్డి, వంశీ చంద్ రెడ్డి, చిన్నారెడ్డిలను బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు స్పీకర్ సస్పెండ్ చేశారు. కోమటి రెడ్డి వెంకటరెడ్డి, సంపత్ శాసనసభ్యత్వాలను రద్దు చేశారు.


మండలిలోనూ కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. షబ్బీర్ అలీ, పొంగులేటి, ఆకుల లలిత, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను మండలి నుంచి సస్పెండ్ చేశారు. చైర్మన్ స్థానంలో నేతి విద్యాసాగర రావు బాధ్యతలు చేప్టటారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే, కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయాలని కోరుతూ మంత్రి హరీశ్ రావు తీర్మానం ప్రవేశపెట్టారు. కోమటి రెడ్డి వ్యవహారాన్ని ఖండిస్తున్నామన్నారు. కోమటిరెడ్డి సభ్యత్వం రద్దుకు హరీష్ రావు ప్రతిపాదించారు. సోమవారం అసెంబ్లీలో జరిగిన ఘటన పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యుల తీరుతో సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. రాజకీయ నేతల ముసుగులో అరాచకం సృష్టిస్తే సహించబోమన్నారు.

సోమవారం జరిగిన ఘటన దురదృష్టకరమని తెలంగాణ స్పీకర్ తెలిపారు. దేశంలో ఆదర్శవంతమైన శాసనసభగా గత నాలుగేళ్లుగా నిలిచిన తెలంగాణలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని స్పీకర్ మధుసుదనాచారి తెలిపారు. డిల్లీలో ఆప్ నేతల కొట్లాటలే దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారితే అసెంబ్లీలో జరిగిన తాజా ఘటన నేటి రాజకీయాలు ఎంతగా దిగజారాయో చెప్పకనే చెప్తోంది.