ఆ మంత్రి నోరు జారాడు పదవి పోయింది

Posted on : 13/03/2018 11:15:00 am

కాశ్మీర్ అంశం ఎంతటి సున్నితమైందో ప్రత్యకేంచి చెప్పనవసరం లేదు. ఈ అంశంపై మాట్లాడటం ఎంతటి నాయకుడికైనా అంత ఆషామాషీ విషయం కాదు. తేడా వస్తే ఏం జరుగుతుందో ఓ మంత్రికి అనుభవపూర్వకంగా తెలిసింది ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. కాశ్మీర్ వివాదం రాజకీయాంశం కాదంటూ ఓ మంత్రి చేసిన వ్యాఖ్యల వల్ల ఆయన పదవి పోయింది. దేశ రాజధానిలో మార్చి 9న నిర్వహించిన పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో పాల్గొన్న కశ్మీర్ ఆర్థికశాఖ మంత్రి డాక్టర్ హసీబ్ డ్రబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘నాకు తెలిసినంత వరకు జమ్మూకశ్మీర్ రాజకీయ అంశం కాదు. కానీ, దీనిని గత 70 ఏళ్లుగా రాజకీయం చేస్తున్నారని’ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఢిల్లీ నుంచి తిరిగి రాగానే గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాకు లేఖ రాస్తూ, మంత్రివర్గం నుంచి డ్రబును తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆమె లేఖకు స్పందించిన గవర్నర్ ముఫ్తీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపారు. 


డ్రబు వ్యాఖ్యలపై స్వపక్షం పీడీపీతోపాటు విపక్షాలు, వేర్పాటువాదులు, వాణిజ్య వర్గాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా పీడీపీ ఉపాధ్యక్షుడు సర్తాజ్ మద్ని డ్రబును ఆదేశించారు. అనంతరం కేబినెట్ నుంచి ఆయనను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మంత్రి వ్యాఖ్యలపై పీడీపీ నిష్టనివారణ చర్యలు ప్రారంభించింది. కశ్మీర్ అంశాన్ని తాము రాజకీయ సమస్యగానే పరిగణనిస్తామని, అంతర్గత, బాహ్య సయోధ్య కోసం చర్చలు ద్వారా పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని పీడీపీ ఆదివారం ప్రకటించింది. పీడీపీ- బీజేపీ కూటమి ఏర్పాటులో డబ్రు కీలక పాత్ర పోషించారు. కూటమి ఏర్పడిన తర్వాత 2014 జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.